కేసీఆర్ కొలువుల జాతరతో జగన్ సర్కార్ పై ఒత్తిడి; ఏపీలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి త్సలనోప్పిగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు సీఎం కేసీఆర్ తరహాలో కొలువుల జాతరను ప్రకటించాలని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video

తెలంగాణా సీఎం జాబ్స్ నోటిఫికేషన్స్ ప్రకటనతో ఏపీ సీఎం జగన్ కు ఇబ్బంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం నిన్నటిదాకా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నోరు తెరిచారు. భారీగా జాబ్ నోటిఫికేషన్స్ ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యమాలు చేసినా జగన్ ఇప్పటివరకు జాబ్స్ విషయంలో నోరు మెదపలేదు.

జాబ్స్ నోటిఫికేషన్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న జగన్ సర్కార్
ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్ సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేస్తే అదనపు ఆర్థిక భారం పడుతుందన్న భావన వ్యక్తమౌతుంది. ప్రతి నెలా ఉద్యోగులకు ఇచ్చే జీతాల విషయంలోనే నానా అగచాట్లు పడుతున్న జగన్ సర్కార్, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా, వారి సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. జాబ్ నోటిఫికేషన్స్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయడం లేదు.
అసెంబ్లీ సాక్షిగా భారీ జాబ్స్ నోటిఫికేషన్స్ ప్రకటించిన సీఎం కేసీఆర్ .. జగన్ సర్కార్ పై ఒత్తిడి
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ఫోకస్ చేశారు. భారీ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని, అలాగే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఇక ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులను మరోమారు జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రేరేపిస్తోంది.

వైజాగ్ లో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం; ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి జగన్ కు డిమాండ్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విశాఖలో పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం తాజా ప్రకటనతో జగన్ సర్కార్ పై ఒత్తిడి పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎటువంటి ప్రకటన రాకపోవడంతో, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకురావడానికి నిరుద్యోగులు ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications