'ప్రధాని అంటే రాజు.. హిట్లర్ కాదు, రూ.2000 నోటుతో నల్లధనంకు మోడీ అండ'
అనంతపురం: ప్రధాని అంటే రాజు అని, హిట్లర్ కాదని, నరేంద్ర మోడీ కూడా తాను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధిని అని గుర్తుంచుకోవాలని ఏపీసీసీ రఘువీరా రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు. రూ.2000 నోటు ముద్రణతో కేంద్రం నల్ల కుబేరులకు కొమ్ము కాసినట్లయిందని ఆరోపించారు.
నల్ల కుబేరులను రక్షించేందుకు కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనంతపురం జిల్లా మడకశిరలో ఎస్‌బీఐ బ్యాంకు వద్ద రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడారు.

నల్ల కుబేరుల వద్ద డబ్బు నిల్వలు ఉండకుండా ఉండాలన్నా, దొంగనోట్ల ముద్రణ పునరావృతం కాకుండా ఉండాలన్నా వెంటనే రూ.2000, రూ.500 నోట్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల కుబేరులపై దాడి చేయడం మంచిదే కానీ, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం సహించమన్నారు.
రూ.2000 నోటు ముద్రణతో కేంద్రం నల్లకుబేరులకు కొమ్ము కాసినట్లయిందన్నారు. తొలి ప్రధాని నెహ్రూపై బీజేపీ ప్రభుత్వం విషం చిమ్ముతోందన్నారు. ఆయనపై లేనిపోని అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. దేశాభివృద్ధికి నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికను ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.
రెండు నెలల ముందే కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకులకు నోట్ల రద్దు విషయం తెలుసునని ఆరోపించారు. దీంతో పాలక పార్టీల నేతలంతా తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను వంద రూపాయల నోట్లలోకి మార్చేసుకున్నారని చెప్పారు. చిల్లర నోట్లు ప్రజలకు అందివ్వకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications