చెప్తున్నారుగా గర్ల్స్‌తో డ్యాన్స్ తప్పే: రిషికేశ్వరి మృతిపై బాబురావు ఏమన్నారు?
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటనలో ప్రిన్సిపల్ బాబురావు పైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువతులతో డ్యాన్స్, రిషికేశ్వరి మృతికి సంబంధించిన విషయాలపై స్పందించారు.
ప్రెషర్స్ డే రోజు విద్యార్థులు బలవంతం చేయడం వల్లే తాను వారితో కలిసి డ్యాన్స్ చేశానని, ఇప్పుడు అందరు అది తప్పని చెబుతుంటే తనకు కూడా తప్పేనని అనిపిస్తోందని చెప్పారు. కాలేజీలో అంతకుముందు ఒకటి రెండు ఘటనలు మినహా ర్యాగింగ్ లేదన్నారు.
ఒకటి రెండు ఘటనలు జరిగినప్పుడు తనకు తెలియగానే వాటిని పరిష్కరించానని చెప్పారు. రిషికేశ్వరి విషయమై ఆమె తండ్రి తమకు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఆమె తండ్రి ఒకసారి మాత్రమే కలిశారని, అది కూడా సీనియర్లతో గది గొడవ విషయమై కలిశారని, ఆ తర్వాత ఆ సమస్య తీరినట్లు చెప్పారన్నారు.
వేధింపుల విషయమై రిషికేశ్వరి లేదా ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పలేదన్నారు. విశ్వవిద్యాలయంలో కొంతమంది తనను లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే తన పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కొంతమంది ఇటీవల తనను వృత్తిపరంగా కూడా లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రెషర్స్‌కు సెకండియర్ విద్యార్థులు ప్రెషర్స్ పార్టీ ఇవ్వడం సహజమన్నారు. ఆ రోజు పిల్లలు బలవంతం చేస్తేనే తాను డ్యాన్స్ చేశానని, ఓ కుటుంబంగా భావించి తాను వారితో కలిసి డ్యాన్స్ చేశానని చెప్పారు.
అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన లేదా వేధించినట్లుగా ఆరోపణలు వచ్చిన ముగ్గురిని అరెస్టు చేశారన్నారు. తాను అవసరమైతే బస్టాపుకు వెళ్లి విద్యార్థులను బస్సు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
రిషికేశ్వరి ర్యాగింగ్ విషయమై తనకు చెబితే చర్యలు తీసుకునే వాణ్ణనని, తాను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారని, అదే నిజమైతే వారు ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదన్నారు. ఆడ పిల్లలతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడారనే ఆరోపణలపై స్పందిస్తూ.. కొందరు తన పైన కుట్ర చేస్తున్నారన్నారు.
యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయకపోవడంపై మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలదేన్నారు. ఒకటి రెండుసార్లు చిన్న సంఘటనలు జరిగాయని, పేరెంట్స్ చెప్పడంతో వాటిని సాల్వ్ చేశామని చెప్పారు.
తమ కళాశాలలో కుల సంఘాలు లేవని తెలిపారు. అవసరమైతే ఎవరైనా తమ విద్యార్థులతో మాట్లాడుకోవచ్చునని, వారే చెబుతారన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య గురించి మాట్లాడుతూ.. హాస్టల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్య దురదృష్టకరమని, ర్యాగింగ్ మూలాన ఇది జరిగితే అలాంటి ర్యాగింగ్ లేకుండా చూసేందుకు కమిటీలు వేస్తామని, అన్ని తరగతులలోను కమిటీలు వేస్తామని చెప్పారు. ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications