
పవన్ ఒంటరవుతున్నారా-మంత్రి నానితో దిల్ రాజు టీం భేటీ : సినీ ఇండస్ట్రీ రాయబారం..!!
పవన్ కళ్యాణ్ తాజాగా సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం..సీఎం జగన్ పైన చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం వర్సెస్ పవన్ ఎపిసోడల్ లో ముగ్గురు జూనియర్ హీరోలు పవన్ వాదనకు మద్దతు ప్రకటించారు. పవన్ వ్యాఖ్యల పైన వరుసగా మంత్రులు రియాక్ట్ అయ్యారు. తాజాగా పోసాని ఎపిసోడ్ రచ్చగా మారింది. ఇక, ప్రస్తుతం పవన్ ఏపీలోనే పార్టీ సమావేశంలో ఉన్నారు. ఇదే సమమయంలో నిర్మాత దిత్ రాజు మంత్రి పేర్ని నాని తో మచిలీపట్నంలో భేటీ అయ్యారు.
పేర్ని నానితో పవన్ నిర్మాత భేటీ
మంత్రిని కలిసేందుకు మచిలీపట్నం వరకు రావటం ద్వారా కీలక సమావేశంగా భావిస్తున్నారు. దిల్ రాజ్ తో పాటుగా డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఉన్నారు. ఈ నెల 20న ఏపీ సచివాలయంలో నిర్మాతలతో ఏపీ ప్రభుత్వం సమావేశమైంది. నిర్మాతలు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆన్ లైన్ టిక్కెట్ల నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ మాత్రం తాము కష్టపడితే..ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముకుంటుందా అని ప్రశ్నించారు. పవన్ ప్రసంగం సమయంలో దిల్ రాజు ఆ ఈవెంట్ లోనే ఉన్నారు.

సినీ ఇండస్ట్రీ ప్రతినిధిగా వచ్చారా
వకీల్ సాబ్ దిల్ రాజు మీరు ఎందుకు తీసారు..మీరు రెడ్డి- జగన్ రెడ్డి..మీరు మీరు తేల్చుకోండి అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దిల్ రాజు నవ్వుతూ ఉండిపోయారు. ఇదే అంశాన్ని తాజాగా పేర్ని నాని సైతం ప్రస్తావించారు. దిల్ రాజు కులం పేరు ప్రస్తావించటంతో ..దిల్ రాజు ఇబ్బంది పడుతూ నవ్వలేక నవ్వుతూ ఉండిపోయారని చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ కు ఏపీలో 50 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లుగా నాని వివరించారు. ఇక, ఇప్పటికే నిర్మాతలు పలువురు ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారానికి మద్దతు ప్రకటించటం..పవన్ వ్యాఖ్యల తరువాత తెలుగు ఫిలిం ఛాంబర్ పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, తాము రెండు తెలుగు ప్రభుత్వాల సహకారం కోరుకుంటున్నామని స్పష్టం చేసింది.

ప్రభుత్వం వద్దకు రాయబారిగానా
తాజాగా ప్రముఖ నటుడు నాగార్జున సైతం రెండు తెలుగు ప్రభుత్వాలు సినీ పరిశ్రమను చల్లగా చూస్తున్నాయని..వారి చూపు ఇలాగే సహకరించేలా ఉండేలా కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఇక, పవన్ వ్యాఖ్యలకు ముందుగా చిరంజీవి సైతం తెలుగు ప్రభుత్వాల సహకరాం కోరుకుంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే, పవన్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ - ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చిందనే విధంగా పరిస్థితులు మారాయి. దీంతో..సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దల టీం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

త్వరలో ఇండస్ట్రీ-ప్రభుత్వం మధ్య చర్చలు
తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం సినీ ఇండస్ట్రీ నుంచి చర్చలకు వస్తామంటే సీఎం సిద్దమేనని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినీ పెద్దలతో సీఎం భేటీకి చొరవ తీసుకోవాలని ఆయన పేర్ని నానిని కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వంతో ఇండస్ట్రీ గొడవలు కోరుకోవటం లేదని..సహకారం మాత్రమే కోరుకుంటోందని ఇండస్ట్రీలోని ప్రముఖులు చెబుతున్నారు. ప్రభుత్వంతో సయోధ్య కోసమే దిల్ రాజు బందరు దాకా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో..త్వరలోనే సిని పెద్దలతో ప్రభుత్వం మరో సారి చర్చలకు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. మీటింగ్ తరువాత ఏం చర్చించారనే అంశం పైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Recommended Video

పవన్ ఇండస్ట్రీలో మద్దతు లభించలేదా
ఏపీ ప్రభుత్వం పైన పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించటం లేదు. ముగ్గురు జూనియర్ హీరోలు మినహా..మిగిలిన వారెవరూ మద్దతుగా నిలవలేదు. ఫిలిం ఛాంబర్ తమకు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పటం ..ఇప్పుడు పవన్ తో సినిమాలు చేసిన నిర్మాతలే నేరుగా ప్రభుత్వం వద్దకు వచ్చి కలవటం చూస్తుంటే వారంతా పవన్ వ్యాఖ్యలతో విభేదించినట్లు కనిపిస్తోంది. దీంతో వారు ఏపీ ప్రభుత్వంతో సఖ్యత కోరుకుంటున్న విషయం అర్దం అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వస్తున్న దూతల ద్వారా త్వరలోనే ఈ సమస్యకు ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.