నంద్యాల జిల్లాకు భూమా నాగిరెడ్డి పేరు: కొత్త డిమాండ్
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం కొంత గందరగోళ వాతావరణానికి దారి తీసినట్టే కనిపిస్తోంది. ప్రత్యేకించి రాయలసీమలో ఈ తరహా పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రాల నిర్ధారణ, నియోజకవర్గాల విలీనం వంటి అంశాల్లో అధికార వైఎస్ఆర్సీపీ నుంచే నిరసన వ్యక్తం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకతను తెలియజేస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు కొత్తకొత్త డిమాండ్లను తెర మీదికి తీసుకొస్తున్నారు.
Recommended Video

రాజంపేట, నగరిల్లో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, పొరుగునే ఉన్న చిత్తూరుల్లో పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉంటూ వస్తోన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత చెలరేగిన విషయం తెలిసిందే. రాజంపేటను జిల్లాకేంద్రంగా ప్రకటించాలంటూ వైసీపీ నాయకులు రోడ్డెక్కారు. ప్రదర్శనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో.. నగరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తోన్నారు.

మరో కొత్త డిమాండ్..
ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు మరో కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. నంద్యాలకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్‌ను తెరమీదికి తీసుకొచ్చారు. ప్రభుత్వం- కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. నంద్యాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనుంది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి.

భూమా కుటుంబానికి గట్టిపట్టు
ఒకప్పుడు భూమా కుటుంబానికి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాలు నంద్యాల, ఆళ్లగడ్డ. 2004 మినహా 1994 నుంచి 2014 వరకు ఆళ్లగడ్డపై భూమా దంపతుల పట్టు కొనసాగింది. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి మూడుసార్లు చొప్పున ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించారు. ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. వారినే ఎన్నుకుంటూ వచ్చారు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఓటర్లు.
టీడీపీ, ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. నంద్యాల అసెంబ్లీ స్థానంపైనా వారికి పట్టు ఉండేది. 2014లో భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి, ఆయన కుమార్తె భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరఫున గెలుపొందారు. ఆ తరువాత పార్టీ ఫిరాయించారు.

నంద్యాల అభివృద్ధి పథంలో
భూమా నాగిరెడ్డి హయాంలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో ప్రయాణించాయని, ఆయన చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేయదలిచిన నంద్యాల జిల్లాకు భూమా నాగిరెడ్డి పేరును పెట్టాలంటూ డిమాండ్ చేశారు. భూమా నాగిరెడ్డి ఓటమి లేని నాయకుడని, తన హయాంలో నంద్యాల రూపురేఖలను మార్చారని అన్నారు.

నంద్యాల, ఆళ్లగడ్డల్లో విస్తృతంగా..
నంద్యాల జిల్లాకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలనే విషయం విస్తృతంగా ప్రచారం చేస్తామని భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి తమ డిమాండ్ వినిపిస్తామని అన్నారు. నంద్యాలకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టడం ఆయనకు ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత గౌరవం అని, దీనిపై సానుకూలంగా స్పందించాలని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇస్తామని అన్నారు.

ఉగాది నుంచి..
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.