బండి భగీరథ్ వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు సీరియస్- కేసు నమోదు
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయి లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సోషల్ మీడియాలో పోస్టులను హైకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. హైకోర్టు మహిళా న్యాయమూర్తిని ట్రోలింగ్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు యూజర్లు పోస్టులు పెట్టారు. భగీరథ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. క్విడ్ ప్రొ కొ రూపంలో జస్టిస్ మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడ్డాయి. అవన్నీ కూడా నిరాధారమైనవని, అనుచిత ఆరోపణలతో కూడినవని హైకోర్టు భావించింది.

పోక్సో పిటీషన్ పై విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవి ఈ అంశాన్ని లేవనెత్తారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా దుష్ప్రచారం చేయడం తనను బాధించిందని పేర్కొన్నారు. ఓ దశలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమని వ్యాఖ్యానించినట్లు సమాచారం. బాధితురాలి తరపు న్యాయవాదికి అభ్యంతరాలు ఉంటే ఈ కేసు విచారణ నుంచి వైదొలగుతానని కూడా ఆమె చెప్పారు. తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అడ్వొకేట్ స్పష్టం చేయడంతో విచారణ కొనసాగించారు. బండి భగీరథ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
విచారణ సమయంలో జస్టిస్ మాధవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఊహాజనిత వ్యాఖ్యలు, అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్).. చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications