జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతుల అల్టిమేటం.. తిరుపతి బహిరంగసభకు అనుమతివ్వకుంటే చేసేదిదే!!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు గత 35 రోజులుగా పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తుళ్లూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులు అడుగడుగున ఇబ్బందులను, పోలీసుల ఆంక్షలను, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రజల మద్దతును కూడగట్టి, అమరావతి ఉద్యమాన్ని మరింత విస్తరించాలని ప్రయత్నిస్తున్న అమరావతి ప్రాంత రైతులు డిసెంబర్ 17వ తేదీన తిరుపతి వేదికగా బహిరంగ సభను నిర్వహించాలని, బహిరంగ సభ ద్వారా జగన్ ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఆకాంక్షను గట్టిగా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.అయితే బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా, రకరకాల షరతులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు పోలీసులు.

తిరుపతి బహిరంగ సభకు అనుమతివ్వని పోలీసులు.. రైతుల అల్టిమేటం
అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడంతో కోర్టును ఆశ్రయించిన రైతులు కోర్టు ఆదేశాలతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన సభకు కూడా పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు అనుమతి ఇవ్వకుంటే తాము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించి బహిరంగ సభకు అనుమతి తెచ్చుకుంటామని తేల్చి చెబుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

36 వ రోజుకు చేరిన అమరావతి రైతుల పాదయాత్ర
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 36 వ రోజుకు చేరుకుంది. రైతుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు రైతులు నెల్లూరు జిల్లాలోని వెంగమాంబ పురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు వెంగమాంబ పురం నుండి మాటమడుగు, బంగారు పల్లి మీదుగా రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. బంగారు పల్లిలో మధ్యాహ్న భోజనం కొనసాగించి ఆ తరువాత రాత్రి సమయానికి వెంకటగిరికి చేరనున్నారు. వెంకటగిరి చేరుకోవడంతో ఈ రోజు పాదయాత్ర ముగుస్తుంది.

పాదయాత్ర చేస్తున్న రైతులపై 42 కేసులు
పాదయాత్ర చేస్తున్న రైతులు నిబంధనలను అతిక్రమించారని ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు పాదయాత్రను అడుగడుగునా నిఘా పెట్టి మరీ పర్యవేక్షిస్తూ, రైతులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో తిరుపతిలో డిసెంబర్ 17వ తేదీన నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్న అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ శివారెడ్డి సభకు చాలా షరతులు పెట్టారని, వాటికి సమాధానం ఇవ్వడానికి అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నేతలు తిరుపతి వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు తిరుపతి సభకు అముతివ్వకుంటే ఆ పని చేస్తామంటున్న రైతులు
అయినా సరే పోలీసులు అనుమతి ఇవ్వకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. ఇక తాము ఎలాంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రలో నమోదవుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైన కేసులు అని ఆయన వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని తేల్చి చెప్పారు.
అడుగడుగునా ఇబ్బందులు పడుతున్న మొక్కవోని దీక్షతో అమరావతి ప్రాంత రైతులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని, ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. అమరావతి ఉద్యమానికి పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు అమరావతి రైతులు.