వైసీపీలో పూడి శ్రీహరికి ప్రమోషన్- కీలక బాధ్యతలు అప్పగించిన జగన్
YS Jagan: గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత డీలా పడ్డ పార్టీ, క్యాడర్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు.

ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.
ఈ మార్పులు చేర్పులను మరింత వేగవంతం చేశారు జగన్. ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఖరారు చేశారు. జిల్లాలకు అధ్యక్షులనూ నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి. బూత్ స్థాయి వరకు కమిటీల నియామకంపై కసరత్తు పూర్తవుతోంది.
పార్టీపరంగా ఇప్పుడు తాజాగా మరో రెండు పదవులను భర్తీ చేశారు జగన్. ఈ క్రమంలో- పార్టీ సీనియర్ నాయకుడు పూడి శ్రీహరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ప్రధాన కార్యదర్శి హోదాలో మీడియా బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఇదివరకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయంలో ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా (సీపీఆర్‌ఓ)గా పని చేసిన అనుభవం ఉందాయనకు.
వృత్తిరీత్యా జర్నలిస్ట్. వివిధ మీడియా సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు పని చేశారు. చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్, కాలమిస్ట్, న్యూస్ ప్రజెంటర్‌గా గుర్తింపు ఉంది. గతంలో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రపై అడుగడుగునా అంతరంగం పేరుతో పుస్తకాన్ని సైతం రాశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన కేవీ రమణారెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు.












Click it and Unblock the Notifications