రామచంద్ర యాదవ్ వెనకున్న బలమైన శక్తి ఎవరు?
రామచంద్ర యాదవ్.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో వివాదం జరిగింది. మంత్రి అనుచరులు యాదవ్ ఇంటిపై దాడిచేసిన ఘటన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పనులకు ప్రాధాన్యం ఏర్పడింది.
జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు.. తాజాగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో కూడా ఆయన హడావిడి ఓ రేంజ్ లో ఉంది. పోటీచేయాలనుకుంటే జనసేన నుంచే పోటీచేయవచ్చు.. లేదా పార్టీ మారాలనుకుంటే తెలుగుదేశం పార్టీలోనైనా చేరొచ్చు. భారతీయ జనతాపార్టీ పెద్దలతో సన్నిహిత పరిచయాలున్నాయి కాబట్టి బీజేపీవైపైనా మొగ్గు చూపొచ్చు. కానీ అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోకుండా కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు మొగ్గుచూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గుంటూరు-విజయవాడ మధ్యలోని నాగార్జున విశ్వవిద్యాలయం దగ్గర ఏర్పాటయ్యే బహిరంగసభలో ఆయన పార్టీని ప్రకటించబోతున్నారు.

జన సమీకరణ కూడా భారీగానే ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. పైకి అతి సాదా సీదాగా కనపడుతున్నప్పటికీ రాష్ట్రం బయట మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా భావిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ పెద్ద పెద్ద నేతలకే దొరకరు. అలాంటిది ఈయన కలవాలి అనుకుంటే వెంటనే షాతో సమావేశమవుతారు. వైప్లస్ సెక్యూరిటీ కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. రాజకీయంగా రామచంద్ర యాదవ్ వేస్తున్న అడుగులు ఆసక్తి కరంగా ఉన్నాయని, ఆయన వెనక ఎవరో ఒక బలమైన శక్తి ఉన్నారని, వారెవరో తెలియాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications