బిజెపి ప్రచార సారథి: ఒకే వేదికపై బాబు, పురంధేశ్వరి?
విజయవాడ: సీమాంధ్ర బిజెపి ప్రచార కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆమె సీమాంధ్రలో వేదికను పంచుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైన స్థితిలో వారిద్దరు ఒకే వేదిక మీదికి రావడం అనివార్యంగా మారుతుంది.
పురంధేశ్వరిని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా శనివారం ఉదయం బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు.ఆయన సీమాంధ్ర పార్టీ ఎన్నికల కమిటీని నియమించారు. ఈనెల 25 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన మీడియాతో అన్నారు.

కాగా, పురంధేశ్వరి సీమాంద్రలో బిజెపికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. తెలుగుదేశం, బిజెపిలో సీమాంద్రలో ఉమ్మడి ప్రచారం చేపడితే పురంధేశ్వరి కచ్చితంగా చంద్రబాబుతో వేదికను పంచుకోవాల్సి ఉంటుంది.
కాగా, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుతో విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన బావమరిది హరికృష్ణతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత బిజెపిలో చేరారు. బిజెపి నుంచి వైదోలగి కాంగ్రెసులో చేరారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండగా, పురంధేశ్వరి మాత్రం బిజెపిలో చేరారు. పురంధేశ్వరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సోదరి.












Click it and Unblock the Notifications