అనుకున్నా కానీ: పురంధేశ్వరి సేఫ్, బాబు సలహాపై...
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తు చర్చలు ఫలవంతమైన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం స్పందించారు. టిడిపితో పొత్తు లేకుంటే తాను కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ స్థానం నుండి తమ పార్టీ నుండి నామినేషన్ వేద్దామనుకున్నానని చెప్పారు.
పొత్తు చర్చలు సఫలమైనందున తాను రాజంపేట నుండి పోటీ చేస్తానని చెప్పారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు రాజంపేట లోకసభకు నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. తనకు తెలుగుదేశం సహకరిస్తుందని తాను భావిస్తున్నాని చెప్పారు. పొత్తులో ఒకరికి మరొకరు సహకరించుకుంటారని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు. విశాఖ స్థానంపై తాను ఒత్తిడి చేయలేదన్నారు. బాపట్ల, విశాఖ తరహా రాజంపేటను అభివృద్ధి చేస్తానని చెప్పారు.

బిజెపి, టిడిపి రగడ విషయంలో పలు అంశాలతో పాటు పురంధేశ్వరికి టిక్కెట్టు పైన కూడా టిడిపికి అభ్యంతరం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే, చర్చల అనంతరం పురంధేశ్వరికి బిజెపి కేటాయించిన స్థానానికి టిడిపి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బాబు సలహాపై....
పొత్తులో భాగంగా బిజెపి 13 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలకు పోటీ చేస్తోంది. బలహీనమైన అభ్యర్థులను టిడిపి నిలబెట్టిందనే విమర్శల నేపథ్యంలో బిజెపి కొంత తగ్గింది. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చేందుకు బిజెపి సిద్ధమైంది. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధపడినప్పటికీ.. లోకసభ అభ్యర్థులు మాత్రం వారే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట నుండి పురంధేశ్వరి పోటీ చేస్తారు.
నర్సాపురం, గుంతకల్లు అసెంబ్లీ అభ్యర్థులను మార్చనున్నారు. నర్సాపురం అభ్యర్థిగా ఉన్న రఘునాథ రావును మార్చి నల్లబోతు వెంకట్రావుకు టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు రాజమండ్రి అర్బన్ సీటుకు బదులు రూరల్ ఇవ్వాలని బిజెపి కోరుతోంది. కాగా, తాము గెలుస్తామనే ఉద్దేశ్యంతోనే అభ్యర్థులను నిలబెట్టామన్నారు.












Click it and Unblock the Notifications