చూద్దాం: చంద్రబాబుపై పురంధేశ్వరి, తెలియదని హరిపై
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేసే అంశంతో పాటు, తన సోదరుడు నందమూరి హరికృష్ణ విషయమై శనివారం స్పందించారు. ఆమె శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాదుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరితే తాను ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేసేది.. లేనిది చూద్దామని చెప్పారు. టిడిపి సీనియర్ నేత, తన సోదరుడు నందమూరి హరికృష్ణ బిజెపిలోకి వస్తారో రారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే..: దగ్గుబాటి
ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తాము పార్టీని మారామని పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. పార్టీ మారమని చెబితే తమను స్థానికులు తెలివి తక్కువవాళ్లుగా చూశారని ఆయన అన్నారు. పార్టీని వెనుకేసుకొచ్చిన పురంధేశ్వరిని స్థానిక నాయకులు తప్పు పట్టారన్నారు.
మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో తమ పైన ఎప్పుడు మచ్చలేదని ఆయన అన్నారు. జైరామ్ రమేష్ తన పైన ఆరోపణలు చేయడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు. తాము కోరుకుంటేనే పదవులు, మంత్రి పదవులు వచ్చాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications