చంద్రబాబు ఎఫెక్ట్: పురంధేశ్వరికి రాజంపేట సీటు
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభావం తీవ్రంగానే పడినట్లు ఉంది. చివరికి ఆమెకు బిజెపి నాయకత్వం కడప జిల్లాలోని రాజంపేట లోకసభ స్థానాన్ని కేటాయించింది. ఈ విషయాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు బుధనారం రాత్రి ఆమెకు ఫోన్ చేసి చెప్పారు.
రాయలసీమ ప్రజలకు ఎన్టీఆర్ కుటుంబంపై ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని, వారి కోరిక మేరకే ఆమెను అధిష్ఠానం రాజంపేట నుంచి బరిలో నిలుపుతోందని హరిబాబు న్నారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా తనకు దక్కిన నాలుగు పార్లమెంటు స్థానా ల్లో ఇప్పటికే నర్సాపురం, విశాఖపట్నం, తిరుపతి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. తాజాగా రాజంపేట నుంచి పురందేశ్వరి బరిలో ఉంటారని బీజేపీ ప్రకటించింది.

అయితే పురందేశ్వరి మొదటి నుంచి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అక్కడి నుంచి కాకపోతే విజయవాడ, నర్సరావుపేట స్థానాల నుంచైనా పోటీకి సిద్ధపడ్డారు. కానీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు బిజెపికి కేటాయించలేదు. చివరి క్షణంలో ఒంగోలు సీటును బీజేపీకి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. పురందేశ్వరి కోసమే ఆ సీటును బిజెపికి కేటాయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ ఆ సీటును వదులుకోవడానికి తెలుగుదేశం అంగీకరించలేదు.
చివరకు బిజెపికి దక్కిన నాలుగు స్థానాల్లోనే పురందేశ్వరికి సీటు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. విశాఖపట్నం నుంచి కంభంపాటి హరిబాబు పోటీకి దిగుతుండడంతో ఆ స్థానాన్ని పురందేశ్వరికి ఇవ్వలేకపోయా రు. వాస్తవానికి విశాఖను పురందేశ్వరికి ఇవ్వాలని ఓ దశలో పార్టీ పెద్దలు భావించారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు విశాఖ దక్కకుండా చేసినట్లు సమాచారం.
నర్సాపురం టికెట్ గోకరాజు గంగరాజును సీటు వరించింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకూ నిరాశే మిగిలింది. తిరుపతి ఎస్సీ లోక్‌సభ స్థానం నుంచి కారుమంచి జయరాంకు టికెట్ ఇచ్చారు. కాగా, గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వి.వెంకట్రామయ్యను బుధవారం ప్రకటించారు. దీంతో పొత్తులో భాగంగా తమకు దక్కిన 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.












Click it and Unblock the Notifications