టైటానియంపై స్పందించాలి: జైరాంకు పురంధేశ్వరి చురక
తిరుపతి: తాను పదవుల కోసం భారతీయ జనతా పార్టీలో చేరలేదని ఆ పార్టీ నేత పురంధేశ్వరి అన్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. శుక్రవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై మండిపడ్డారు. అందరిపై విమర్శలు చేసే జైరాం రమేష్ టైటానియం కుంభకోణంపై స్పందిస్తే బాగుంటుందని ఆమె చురక అంటించారు.
బిజెపి వల్లే సీమాంధ్రకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. విభజన బిల్లుకు ఆమోదం తర్వాత సీమాంధ్రకు కాంగ్రెస్ న్యాయం చేయలేదనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

లోకసభలో బిజెపి నేత సుష్మాస్వరాజ్ సీమాంధ్రకు న్యాయం చేయాలని పట్టుబట్టారని పురంధేశ్వరి గుర్తు చేశారు. అదేవిధంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారని తెలిపారు.
బిజెపి పోరాటం వల్లే సీమాంధ్రకు ప్యాకేజి లభించిందని పురంధేశ్వరి అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎదుర్కోలేని వారే తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తులు అవసరమని సీమాంధ్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, రెండ్రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications