కత్తులు దూసుకోవడమే...: చంద్రబాబు వర్సెస్ పురంధేశ్వరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు చంద్రబాబు ప్రభుత్వంపై మాటల ఈటెలు విసురుతున్నారు. ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో దూకడానికి సిద్ధపడుతున్నారు.
ఈ తరుణంలోనే మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపి పరస్పరం కత్తులు దూసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, ఇతరాలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టడానికి సమాయత్తమైనట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
మరో వైపు బిజెపి నాయకులు కరవు పరిస్థితిపై చంద్రబాబుపై పోరాటానికి వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య ముఖాముఖి పోరుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై, ఇతర విషయాలపై చంద్రబాబు గతంలో లేని విధంగా కేంద్రంపై ప్రశ్నలు సంధించారు.

టిడిపి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసినట్లుగానే పార్లమెంటులో మాట్లాడారు. ఈ స్థితిలో టిడిపి సీనియర్ శాసనసభ్యుడు బుచ్చయ్యయ చౌదరి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల పొత్తు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహాయం అందడంలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్‌తోపాటు బిజెపికీ భాగం ఉందని దుయ్యబట్టారు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ ముందునుంచీ పాట పాడిన బిజెపి రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తే అందుకు పూర్తిగా సహకరించిందని నిందించారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలుచేశారు.
కాంగ్రెసుకు బిజెపి సహకరించింది...
ప్రత్యేక హోదాకు నీతి ఆయోగ్ అంగీకరించడంలేదని చెబుతున్నరని, రాష్ట్ర విభజన చేయమని నీతి ఆయోగ్ చెప్పిందా అని ప్రశ్నించారు. పార్లమెంటు తలుపులు మూసేసి, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే, బిజెపి సహకరించలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా, రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా అని రాజ్యసభలో చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. దమ్మిడీ సాయానికి వంద లెక్కలు అడగడం దేనికని విమర్శించారు.
చంద్రబాబు వాళ్ల కాళ్లకు మొక్కాలా...
ఎయిమ్స్ వంటి సంస్థలకు స్థలం, వౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే పథకాలకు వంద కోట్ల లోపు నిధులు కేటాయిస్తే అవి ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. 30 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినా ఫలితంలేదని, ఇక ముఖ్యమంత్రి వాళ్ల పాదాలకు మొక్కాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఇందిరాగాంధీ, సోనియా గాంధీలు ఫలితం అనుభవించారని, ఇప్పుడు వేరేవారికి అదే గతి పడుతుందని బిజెపిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వౌనం వీడితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. రాజధానికి నిధులు అంటూ సన్నాయి నొక్కులు తప్ప పైసా విదల్చడంలేదన్నారు.
మరో ఉద్యమం రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడి నిధులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపి మాగంటి మురళీమోహన్ పాల్గొన్నప్పటికీ, వేరే పనులున్నాయని మధ్యలోనే వెళ్లిపోయారు. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ప్రత్యక్ష పోరాటానికి బిజెపి
తెలుగుదేశం పార్టీ తీరుపై ఇక ప్రత్యక్ష పోరాటానికి రాయలసీమ బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. రాయలసీమలో కరువు పరిస్థితిలపై ఆందోళనకు శ్రీకారం చుట్టే పనిలో బిజెపి పడినట్లు తెలుస్తోంది. కడప నగరంలో ఆదివారం రాత్రి సీమ జిల్లాలకు చెందిన బిజెపి నేతలు జరిపిన రహస్య సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్టవ్రిభజన అనంతరం నూతన రాజధాని నిర్మాణానికి, పెండింగ్‌ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా ఆ నిధుల గురించి చెప్పకుండా, కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నేతలు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీమలో విస్తృతంగా పర్యటించి జిల్లాల వారీగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.
రాయలసీమ నేతలకు బిజెపి హైకమాండ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుతెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కేంద్రమాజీ మంత్రి డి పురంధ్రీశ్వరి, ఒకప్పుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బిజెపిలో సీనియర్ నేతగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ, తదితరులను ముందుంచి టిడిపి ప్రభుత్వంపై నిరసన ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications