హేయం, పరువుతో ఆడుకోవడమే..! అరెస్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం స్కాంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్తున్న మద్యం స్కాంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు కీలక నిందితుల్ని అరెస్టులు కూడా చేసింది. ఇదే స్కాంలో జగన్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ పలు కేసులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్టు, జైలుకు పంపడంపై జగన్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ జరిగిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ లీగల్ సెల్ నాయకుల భేటీలో జగన్ మాట్లాడారు. తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం చేస్తున్నారని, ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం కనిపిస్తోందని ఆరోపించారు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలన్న కక్ష కనిపిస్తోందన్నారు. ఎలాగైనా వారిని చిత్ర హింసలు పెట్టాలని ఆలోచిస్తున్నారన్నారు. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి కనిపిస్తోందన్నారు.

ఈ సందర్భంగా అరెస్టులపై స్పందిస్తూ.. ఒక మనిషిని జైల్లో పెట్టడం అత్యంత హేయమని జగన్ వ్యాఖ్యానించారు. అది వారి పరువు, ప్రతిష్టతో ఆడుకోవడమే అన్నారు. అన్నీ తెలిసి కూడా ఇవన్నీ చేస్తున్నారన్నారు. తప్పు చేయకపోయినా బురద వేస్తున్నారన్నారు. వైయస్సార్‌సీపీ కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులతో కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి తోడుగా నిలబడుతున్న పార్టీ లాయర్లను జగన్ అభినందించారు. వారి అంకితభావం, సేవలన్నీ గుర్తు పెట్టుకుంటామన్నారు. జగన్ 2.0 లో వారందరికీ పూర్తి న్యాయం చేస్తామన్నారు.

మరోవైపు అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని, చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4500కు బ్రహ్మాండంగా కట్టొచ్చని జగన్ తెలిపారు. లగ్జరీగా ఎక్కడైనా, హైదరాబాద్, బెంగళూరులో కట్టొచ్చన్నారు. కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9500, రూ.10 వేలకు ఇచ్చారన్నారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజమన్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలోనూ ఇదే పరిస్దితి అన్నారు. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు బుద్ది చెబుతాడని, తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదన్నారు.












Click it and Unblock the Notifications