పివి సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. చంద్రబాబు ఆఫర్ కు ఓకే చెప్పిన సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఆఫర్ చేయగా, ఆమె అందుకు అంగీకరించింది.
విజయవాడ: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు త్వరలో డిప్యూటీ కలెక్టర్ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఆఫర్ చేయగా, ఆమె అందుకు అంగీకరించింది.
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత దేశ కీర్తిని ఇనుమడింపజేసిన సింధుకు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3 కోట్లు నగదు బహుమతి అందజేయడం, దీనికి పోటీగా తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల నగదు బహుమతి ఇచ్చి సత్కరించడం తెలిసిందే.

నగదు బహుమతులతోపాటుగా ఇళ్ల స్థలాలు కూడా దక్కించుకున్న సింధుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ అవకాశం ఇచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రతిపాదన చేయగా, సింధు ఇందుకు అంగీకరించినట్లు ఆమె తల్లి విజయ తెలిపారు.
ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే అపాయింట్ మెంట్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా సింధు తల్లి విజయ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications