పోలవరంపై కెసిఆర్ భూకంపం హెచ్చరిక, చిన్నచూపొద్దు
హైదరాబాద్: పోలవరం డిజైన్ మారిస్తే ఆంధ్రాకే మంచిదని, అలాగే కడితే భూకంపాలతో ముప్పు తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం హెచ్చరించారు. తెలంగాణ పాత్రికేయ సంఘం ఆవిర్భావ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణకు రాయితీలు ఉంటాయని ప్రధాని ప్రకటనలో స్పష్టంగా ఉందని చెప్పారు. 17 మంది ఎంపీలను గెలిపించుకొని తెలంగాణలో ఆంక్షలను తొలగించుకుంటామని చెప్పారు.
తెలంగాణ భాష, సంస్కృతిపై సీమాంధ్ర మీడియా చిన్న చూపు చూడరాదని, ఉద్యమంపై సీమాంధ్ర మీడియా చివరి వరకు విషయం కక్కుతూనే ఉందని, తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఇప్పుడైనా మీడియా తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మాట్లాడేదే నిజమైన తెలుగు అని వారికో భ్రమ ఉందని అన్నారు. భాష ఒకడి సొత్తు కాదని, ఎవరు నేర్చుకుంటే వారికి వస్తుందన్నారు. ఆదికవి నన్నయ్య కారని, అనువాదకవి అన్నారు.

ఆది కవి పాల్కూరికి సోమనాథుడు అని చెప్పారు. తెలంగాణలో ఉర్దూ కలిపిన తెలుగు మాట్లాడతారు అంటూ అపహాస్యం చేసేవారని అన్నారు. రాజమండ్రి జైలు నుంచి ఖైదీల పరార్ అని వార్త రాస్తారని, అందులో జైలు, ఖైదీ, పరార్ ఈ మూడు కూడా ఉర్దూ పదాలేనని, తాము ఉర్దూను ఉపయోగిస్తున్నామని కూడా తెలియకుండా వాళ్లు ఉర్దూ ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో ఎక్కడైనా భాషలో ఉర్దూ పదాలు చాలా కలిసిపోయాయన్నారు. మన భాష, మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలని దీనికి మీడియా సైతం సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పుడున్న హౌసింగ్ సొసైటీ సంకరమైంది, మరో సొసైటీ ద్వారా ఇళ్లు లేని జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్టు తెలిపారు. అందరికీ ఇచ్చినట్టుగా సహాయం అందిస్తే, మిగిలిన డబ్బులు మేం కలిపి నిర్మించుకుంటామన్నా సరేనని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఒక భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. పాతిక బెడ్‌రూంలతో, కంప్యూటర్ల వంటి సదుపాయాలతో పరిశోధనలకు ఉపయోగపడే విధంగా సర్వ హంగులతో ఈ భవన నిర్మాణ బాధ్యత తనది అని కెసిఆర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications