ఏపీ ప్రపంచంలోనే నెం. 1, బీఆర్ఎస్ సక్సెస్: తిరుమలలో తెలంగాణ నేతలు
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సందర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

బీఆర్ఎస్ 100 శాతం సక్సెస్ అంటూ తెలంగాణ మంత్రి
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తిరుపతి దేవస్థానంలో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తే.. దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్, రైతు బంధు, దళిత బంధు అమలు చేస్తున్న రాష్ట్ర తెలంగాణ మాత్రమే అని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ దేశంలో 100 శాతం సక్సెస్ అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. ప్రజలను మెప్పించే సామర్థ్యం ఉంటే.. ఏ పార్టీ అయినా సక్సెస్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

ఏపీ ప్రపంచంలోనే నెంబర్ 1 అంటూ ఆర్ కృష్ణయ్య
మరోవైపు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏపీ 20 ఏళ్లలో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఆదర్శవంతంగా ఉందన్నారు. పేదవర్గాలు ఎలా అభివృద్ధి చెందుతారో సీఎం జగన్ ఆలోచించి, ఎంతో అనుభవమున్న సంస్కరణవాదిగా.. విప్లవవాదిగా బ్రహ్మండమైన పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.

జగన్ ఓట్ల సీఎం కాదంటూ ఎంపీ ఆర్ కృష్ణయ్య
జగన్ ఓట్ల సీఎం కాదు.. పేదవర్గాల సీఎం అని అన్నారు. సీఎం జగన్ పేద ప్రజలకు అందిస్తున్న విద్యతో భవిష్యత్తులో సబ్సిడీ పథకాలు అవసరం రాదన్నారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఏపీకి మరింత బడ్జెట్ వచ్చేలా చేసి రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. పేద కులాలకు అధికారం, సంపద, బడ్జెట్, విద్యలో వాటా ఇస్తున్న సీఎం జగన్‌కు ఆర్ కృష్ణయ్య అభినందనలు తెలిపారు. కాగా, ఆర్ కృష్ణయ్య.. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

తిరుమల భక్తుల రద్దీపై బీజేపీ నేత వాకాటి
బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో అధిక రద్దీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి అవస్థలు చూసి వెనుక ఉండే భక్తులకు త్వరగా దర్శనం కావాలనే ఉద్దేశంతోనే తొందరగా దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చామని తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖ, శాంతులతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్లు వాకాటి నారాయణ రెడ్డి చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతోపాటు తమిళనాడుకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం రావడంతో గత మూడు రోజులుగా దర్శనానికి 40 గంటలకుపైగా పడుతోంది.












Click it and Unblock the Notifications