కెసిఆర్ వరాలిస్తుంటే..: చంద్రబాబుపై రాఘవులు
న్యూఢిల్లీ: రాష్ట వ్రిభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల్లో తలెత్తిన వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న తపన ఇద్దరు ముఖ్యమంత్రులలో కనిపించటం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించుకోవటంకంటే అవి కొనసాగితేనే తమకు అన్నివిధాలా మంచిదన్న ధోరణి వారిలో కనిపిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎడాపెడా వరాలు ప్రకటించుకుపోతుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వద్ద డబ్బులు లేవని తెగేసి చెబుతుండటంతో రెండు రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని రాఘవులు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రావటానికి ఇద్దరు నాయకులు గుప్పించిన హామీల అమలుపై అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రెండు ప్రాంతాల ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు, వివాదాలు తలెత్తకూడదని తాము ఆశించిన దానికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవటంపై దృష్టిపెట్టటం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వల్ల సమస్యల పరిష్కారం సాధ్యంకాకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలని రాఘవులు సూచించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణ విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన చెప్పారు. 1956 తర్వాత కూడా తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను వర్తింప చేయాలని ఆయన కోరారు. రైతు రుణ మాఫీ ఒక ప్రహసనంగా మారిందని ఆయన చెప్పారు. ఎన్నికలలో విజయం సాధించటానికి అన్ని పార్టీలు రైతులకు రుణ మాఫీ ఆశ చూపించి ఇప్పుడు కుంటి సాకులతో తాత్సారం చేయటం రైతులను ఆవమానించటమే అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications