ఆ పాట పాడిన మంగ్లీకి ఎస్వీబీసీలో పదవా - ఎంపీ రఘురామ..!!
ప్రముఖ సింగ్ సత్యవి మంగ్లీ రాథోడ్ కు ఏపీ ప్రభుత్వం తాజాగా పదవ కట్టబెట్టింది. పాటలతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన మంగ్లీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా బాధ్యతలు కేటాయించింది. తాజాగా మంగ్లీ ఈ బాధ్యతలను స్వీకరించారు. దీని పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీని ఎలా నియమిస్తారని రఘురామ ప్రశ్నించారు. అదే సమయంలో సీఎం జగన్ నర్సాపురం పర్యటనపైన కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రముఖల పేర్లు వెలుగులోకి
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొన్ని రాష్ట్రాల నేతల ప్రమేయం ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. త్వరలోనే కొంత మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు శరత్ చంద్రారెడ్డిని వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలవడంపై రఘురామ స్పందించారు. శరత్ చంద్రారెడ్డి చెవిలో చెవిరెడ్డి ఎవరి పేర్లు చెప్పవద్దంటూ సూచించారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు వేగంగా జరుగుతోందని రఘురామ వివరించారు.

నర్సాపురంలో మభ్య పెట్టేందుకే
తక్కువ సమయంలోనే అంచనాలకు భిన్నంగా ఇందులో భాగస్వాముల పేర్లు బయటకు వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తన్నారనే అపోహలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎవరినీ ప్రధాని ఉపేక్షించరని రఘురామ చెప్పుకొచ్చారు. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని మద్యం కుంభకోణంలో అదుపులోకి తీసుకున్నారని, త్వరలోనే మిగతా వారి వంతు కూడా ఉంటుందన్నారు. ఇక, సీఎం జగన్ నర్సాపురం పర్యటనలో ప్రజలను మభ్య పెట్టేందుకే రూ 3,300 కోట్ల మేర అభివృద్థి పనులకు శంకుస్థాపన చేసారని.. వాస్తవానికి రూ.13 కోట్ల పనులను మాత్రమే ముఖ్యమంత్రి ప్రారంభించారని వివరించారు. తాజాగా నర్సాపురం పర్యటనలో సీఎం జగన్ ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసారు.

అశ్లీల పాట పాడిన మంగ్లీకి పదవా
దేశంలోనూ మూడో ఆక్వా యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు కానుంది. అదే విధంగా ఇదే నియోజకవర్గ పరిధిలో ఫిషింగ్ హార్బర్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. వీటితో పాటుగా స్థానికంగా అనేక అభివృద్థి పనులను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నర్సాపురం సభలో చెప్పుకొచ్చారు. కానీ, స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ అవన్నీ మభ్యపెట్టేవిగా విమర్శించారు. ఒక చిత్రంలో అశ్లీల గీతాన్ని ఆలపించిన గాయని మంగ్లీని ముఖ్యమంత్రి జగన్ ఎస్‌వీబీసీ సలహాదారుగా నియమించడం పట్ల రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగ్లీకి పదవికి కేటాయింపు పైన రఘురామ వ్యాఖ్యలక వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications