వైసీపీ ఎంపీని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబుకు ఉలుకెందుకు?: ముద్రగడతో కంపేర్
అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం పట్ల టీడీపీ స్పందిస్తోన్న తీరు అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది. ఇదివరకు మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర కుమార్, చింతమనేని ప్రభాకర్ వంటి సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేసిన సందర్భాలను మించి.. రెట్టింపు స్పందన కనపరుస్తోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీడీపీలో ఉలికిపాటు..
ఒక్క టీడీపీ మాత్రమే కాదు.. ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన సైతం రఘురామ అరెస్టును తప్పుపడుతున్నాయి. సాధారణంగా తమ పార్టీ నేతలపై కేసులు పెట్టినా, అరెస్టు చేసినా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం, ఆందోళనలు చేయడం, అధికార పార్టీపై ధ్వజమెత్తడం సహజం. ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష సాధిస్తోందని, అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ చెప్పుకోవడం చూశాం కూడా. ఆ హక్కు ప్రతిపక్షాలకు ఉంది. దీనికి భిన్నంగా అధికార పార్టీ ఎంపీ అరెస్టును తప్పు పట్టడం చర్చనీయాంశమౌతోంది.

టీడీపీ సోషల్ మీడియా మొత్తం రఘురామే
రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రమే కాదు- చివరికి సునీల్ దేవ్‌ధర్ సైతం స్పందించారు.
బీజేపీ నేతలు పలువురు రఘురామ అరెస్టును తప్పుపట్టారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు కురిపించారు. టీడీపీ సోషల్ మీడియా మొత్తాన్నీ రఘురామ కృష్ణంరాజు ఆక్రమించేశారు.

ముద్రగడ అరెస్ట్‌పై
ఈ పరిస్థితుల్లో రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారాన్ని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉదంతంతో పోల్చి చూస్తోన్నారు వైఎస్సార్సీపీ నాయకులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ముద్రగడ, ఆయన భార్యను చేయించిన విషయాన్ని ప్రస్తావిస్తోన్నారు. ఓ సామాజిక అంశం కోసం, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మానాభం, ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు లేని స్పందన.. బూతులు మాట్లాడే అధికార పార్టీకి చెందిన ఎంపీని అరెస్ట్‌పై ప్రదర్శించడాన్ని నిలదీస్తోన్నారు.

రఘురామ వెనుక ఉన్నదెవరో తేలిందిగా
చంద్రబాబు అధికారంలో ఉండగా ముద్రగడ కుటుంబాన్ని పోలీసులతో చిత్రహింసలకు గురి చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నిస్తోన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు కేబినెట్ మంత్రి నారా లోకేష్..ముద్రగడ సమక్షంలోనే పోలీసులకు ఆదేశాలను ఇచ్చిన ఉదంతాన్ని గుర్తు చేస్తోన్నారు. టీడీపీ స్పందిస్తోన్న తీరును బట్టి చూస్తోంటే.. ఇన్నాళ్లూ ఆయనను తెర వెనుక ఉండి నడిపించినది తెలుగుదేశం పార్టీనే అనేది స్పష్టమౌతోందని చెబుతున్నారు. వైసీపీలో అసమ్మతిని సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లూ డ్రామా ఆడిందనేది.. ఆయన అరెస్ట్ ఉదంతంతో తేటతెల్లమౌతోందని అంటున్నారు.

టీడీపీలో చేర్చుకుంటారా?
ఈ పరిణామాలన్నీ సద్దు మణిగిన తరువాత.. రఘురామ కృష్ణంరాజు తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, వైసీపీని వీడటమంటూ జరిగితే.. ఆయనను టీడీపీ చేరదీస్తుందా? అనేది అనుమానమే. 2024 నాటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తుందనే గ్యారంటీ కూడా ఎవరూ ఇవ్వట్లేదు.
వైసీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఏకైక కారణంతో రఘురామకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందనడంలో సందేహాలు అక్కర్లేదు. రఘురామకు మద్దతు పలకడం వల్ల ఆయన ఇదివరకు వైసీపీపై చేసిన విమర్శలు కులాలు, మతాల ప్రస్తావనతో చేసిన ఆరోపణలను సమర్థించినట్టయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications