పవన్ ను 50 వేల మెజార్టీతో గెలిపించుకుంటా-నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా చెప్తున్నా-రఘురామ సవాల్..
భీమవరంలో రీల్ స్టార్ మీద రియల్ స్టార్ ను నిలబెడుతున్నామంటూ నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా చెప్తున్నా.. భీమవరంలో ఈసారి పవన్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఇదే తన సవాల్ అన్నారు. పవన్ పెళ్లిళ్లకు ఓట్లకు ఏమైనా సంబంధముందా, సీఎం వ్యాఖ్యలు ఆయన దివాళాకోరుతునాన్ని సూచిస్తున్నాయన్నారు. రోజుకిద్దరు చొప్పున నెల రోజుల్లో వైసీపీ నుంచి 60 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్నారు.
మూడేళ్లకు మించి ఒక్కొక్క భార్యతో వైవాహిక జీవితాన్ని గడప లేని పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తారా అంటూ భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లకు, ఓట్లకు సంబంధం ఏమిటన్నారు. సీఎం మాట్లాడిన తీరు ఆయన భావ దారిద్రాన్ని, దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోందన్నారు.
భీమవరం లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, నరసాపురం ఎంపీగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా సీఎంకు సవాల్ చేస్తున్నానని రఘురామ తెలిపారు.

సీఎం జగన్ ఆత్మకథగా తీసిన వ్యూహం చిత్రం సంక్రాంతి పండగకు, రిపబ్లిక్ డే కి కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సినిమాను రాంగోపాల్ వర్మ కాకపోతే మరొక దర్శకుడితో తీసేవారని రఘురామ వెల్లడించారు. సినిమాలో చూపించే వ్యక్తుల అనుమతి తీసుకోకుండా వారి పాత్రలను చిత్రంలో చూపించడానికి వీలు లేదన్నారు.
టీడీపీ, జనసేన కూటమి వ్యవహారం తాము చూసుకుంటామని, పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలతో తల బొప్పి కట్టిన వ్యవహారాలన్నీ సీఎం జగన్ చక్కదిద్దుకుంటే మంచిదని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. రోజుకు ఇద్దరు చొప్పున పార్టీని వీడిన నెలకు 60 మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడే అవకాశం ఉందన్నారు. తాజాగా వైసీపీని వీడుతున్న ప్రజాప్రతినిధులను ఇందుకు ఉదాహరణగా చూపారు. అలాగే పార్ధసారధి లాంటి ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యల్ని గుర్తుచేశారు.

ప్రజలు జగన్ ను తిరస్కరించారన్న విషయం అర్ధమైందని, ఇప్పుడు దాన్ని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వర్తింపచేసి వారిని బలి చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పై ప్రజలకు ఉన్న ద్వేషాన్ని 150 మంది ఎమ్మెల్యేలపై, 20 మంది ఎంపీలపై ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం అందరికీ స్పష్టంగా అర్థమయిందన్నారు. మీరెంతగా మసి పూసి మారేడు కాయ చేయాలని చూసినా... ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం లేదని, ఆయన్ని తెగ ప్రేమిస్తున్నారని చెప్పేందుకు చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అవుతాయన్నారు.












Click it and Unblock the Notifications