రఘురామ విజయం ఎక్కడో తేడా కొడుతుందే..?
వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ణం రాజు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటు ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఒకనొక సమయంలో రఘురామ కృష్ణం రాజుకు కూటమి తరుఫున టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది.
చివరికి ఆయన టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు సైలెంట్ అయినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. టీడీపీ తరుఫున టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో ఉండి నియోజకవర్గంలో రఘురామ గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉండి నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుండి టీడీపీకి పెట్టనికోట. 1983 నుండి 1999 వరకు కలిదిండి రామచంద్రరాజు వరసగా ఐదు సార్లు గెలిచాడు. 2004లో మాత్రమే అక్కడ కాంగ్రెస్ గెలిచింది.

2009, 2014లో రెండు సార్లు శివరామరాజు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి బలంగా విచినప్పటికీ ఇక్కడ మంతెన రామరాజు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటువంటి తరుణంలో రఘురామ అనూహ్యంగా టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకున్నారు. రఘురామ కృష్ణం రాజు విజయం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికి ఆయన గెలుపుపై ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు చీల్చే ఓట్లను బట్టే రఘురామ విజయవకాశాలు ఆధారపడి ఉందనేది సుస్పష్టం.రఘురామ విజయంపై దాదాపు రూ.35 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. జూన్ 4న ఈవీఎంలు తెరిస్తే కానీ రఘురామ భవితవ్యం బయటపడదు.












Click it and Unblock the Notifications