బీసీలకు అన్యాయం వద్దు: రఘువీరా, ‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’, ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్
న్యూఢిల్లీ/విజయవాడ: బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హాయంలో పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టండి: హర్షకుమార్
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాపుల రిజర్వేషన్లు కల్పించమంటే.. బీసీలను రెచ్చగొడుతున్నారని హర్షకుమార్ మండిపడ్డారు.

పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల కోసం కాపు ప్రజాప్రతినిధులంతా తమ పదువులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే కాపు రిజర్వేషన్ల కోసం ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటానని హర్షకుమార్ తెలిపారు.
కిర్లంపూడిలో దీక్ష: ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
కాపు కులస్థులకు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి కిర్లంపూడిలోని తన స్వగృహంలో భార్యతో కలిసి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన్ను పలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆందోళనకారులు భారీగా తరలి వస్తారని భావించిన పోలీసులు కిర్లంపూడిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
దీక్షకు ముందు ముద్రగడ దంపతులను వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా వైద్యులు ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ లెవల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు.
కాగా, ఆయన నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు కాపు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తనను చూసేందుకు ఎవరూ కిర్లంపూడికి రావద్దని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. తాను గాంధేయ మార్గంలో ఆందోళన చేపట్టానని, వివిధ జిల్లాల్లో ప్రజలంతా ఎవరికి వారు ఇళ్ల వద్దనే నిరసన తెలియజేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications