పవన్ కళ్యాణ్‌కు అమరావతి ఆహ్వాన పత్రం అందించిన మంత్రులు: టీ నేతలకూ...
హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు హైదరాబాదులో ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు. వారు వారికి ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు శనివారం మంత్రులు ఆమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రం అందించారు.
తెలంగాణ ప్రతిపక్ష నేత కె. జానారెడ్డికి, తెలంగాణ కాంగ్రెసు నేత షబ్బీర్ అలీకి, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి వారు ఆహ్వాన పత్రాలు అందించారు. అమరావతిని సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె. జానారెడ్డి కోరారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆంధ్రా మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనకు అహ్వాన పత్రం అందించినందుకు పద్మా దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా తాను అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని ఆమె మంత్రులకు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అమరావతి శంకుస్థాపన చేపట్టినందుకు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కూడా మంత్రులు ఆహ్వాన పత్రాలు అందించారు.
ఇప్పటి వరకు 87 వేల మందికి ఆహ్వాన పత్రాలు అందించినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మంత్రి చిన్నరాజప్ప చెప్పారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు ఆహ్వాన పత్రం అందించడం తమ బాధ్యత అని, రావడం రాకపోవడమనేది జగన్ ఇష్టమని ఆయన అన్నారు. ఆహ్వాన పత్రం అందక ముందే అమరావతి శంకుస్థాపనకు రానని జగన్ చెప్పడం దురదృష్టకరమని అన్నారు.












Click it and Unblock the Notifications