జగన్‌ను ఏకేసిన రఘువీరా: పవన్ కళ్యాణ్ తప్పు లేదన్న అచ్చెన్నాయుడు
అనంతపురం/ కర్నూలు : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్‌ది రాజకీయ పార్టీ కాదని, దివాళా తీసిన పార్టీ అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తిట్టాల్సింది ప్రధాని నరేంద్ర మోడీనా, తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీనా అని ఆయన ప్రశ్నించారు. తనతో సహా తమ పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్యాకేజీతో కాదు, ప్రత్యేక హోదా ఎజెండాతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని ఆయన సూచించారు. అపోహలు, వాస్తవాలు, లాభాలు పేరుతో ఇంటింటికీ కరపత్రాలు పంచుతామని ఆయన చెప్పారు.
కాగా, రాజధాని నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, రావెల కిశోర్ బాబు కోరారు. పవన్ కళ్యాణ్ రైతులను ఒప్పించాలని వారు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలపై అనుమానాలు వద్దని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు.
ప్రత్యేక హోదాపై ఎలాంటి అనుమానాలు వద్దని, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రత్యేక హోదా కల్పిస్తుందని అచ్చెన్నాయుడు ధీమావ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో ఏం వస్తుందో తెలియదు గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు కృషి చేస్తారని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదాను గత కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఎందుకు చేర్చలేదో రఘువీరా రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడంలో తప్పు లేదని ఆయన అన్నారు. సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నోరు మెదపడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications