ఆ 'అనంత' ఊళ్లోనే అప్పుడు నానమ్మ, ఇప్పుడు రాహుల్: వైఎస్‌కు నివాళిపై వైసిపి ఫైర్
హైదరాబాద్: ఎఐసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ రేపు (శుక్రవారంనాడు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ 1979లో ప్రసంగించిన గ్రామంలోనే రేపు రాహుల్ గాంధీ ప్రసంగం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా మండిపడుతున్నాయి.
రాహుల్ గాంధీ తన పర్యటనలో రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ప్రధానంగా ప్రస్తావిస్తారని అంటున్నారు. పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆయన ఇటువంటి పర్యటనలే చేశారు. అనంతపురం జిల్లాలో ఆయన పాదయాత్ర ఓబులదేవర చెరువు గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. పది కిలోమీటర్ల పాటు సాగే పాదయాత్రలో ఆయన రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటారు.
రాహుల్ గాంధీ డాక్టర్ అంబేడ్కర్, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కారణమైందని, ఈ విభజనలో సీమాంధ్రకు నష్టం జరిగిందని, ఇందుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పిన తర్వాతనే అనంతపురం జిల్లాలో పర్యటించాలని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు అంటున్నారు.

అనంతపురం జిల్లాలోని వివిధ గ్రామాల్లో రాహుల్ గాంధీ రైతులను, వలస కూలీలను పలకరిస్తారు. ఆత్మహత్య చేసుకున్న హరినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్సిస్తారు. పాదయాత్ర తర్వాత ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. తన పర్యటనను ముగించడానికి ముందు పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శిస్తారు.
రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటున్న ప్రత్యేక సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలను లేవనెత్తుతారని భావిస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించడం అర్థం లేని చర్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది. టిడిపి ఇదే అభిప్రాయంతో ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని వైయస్సార్ పార్టీ తప్పు పడుతోంది. తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెసు పార్టీ వైయస్ కుటుంబాన్ని కేసుల పేరు మీద వేధిస్తూ వచ్చిందని, అటువంటి కాంగ్రెసుకు వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించే అర్హత లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెసు, టిడిపి కలిసి పనిచేశాయని, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయని, రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించడం అర్థరహితమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు.
ఓదార్పు యాత్ర చేపట్టడానికి కాంగ్రెసు అధిష్టానం జగన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో వైయస్ కుటుంబాన్ని అవమానించిందని, దాంతోనే జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చారని, ఆ తర్వాత కేసుల పేరు మీద వైయస్ కుటుంబ సభ్యులను వేధిస్తూ వచ్చిందని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారని ఆమె గుర్తు చేశారు. ఈ స్థితిలో వైయస్‌కు రాహుల్ గాంధీ ఎలా నివాళులు అర్పిస్తారని ఆమె ప్రశ్నించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గానీ జగన్ గానీ ఎందుకు పరామర్శలు చేయలేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు చాలా తక్కువగా జరిగాయని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications