విశాఖ జోన్ ఆపరేషన్స్ - సరిహద్దులు ఖరారు.. ఇక ఈ స్టేషన్లు.. రైళ్లన్నీ..!!
విశాఖ జోన్ కేంద్రంగా ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరిహద్దులు.. స్టేషన్లు.. ఉద్యోగులు కేటాయింపు పూర్తి అయింది. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. కొత్త జోన్ పరిధిలో 385 స్టేషన్లు.. 62 వేల మంది ఉద్యోగులను ఖరారు చేసారు. మొత్తంగా 3 వేల 532 కిలో మీటర్ల మేర జోన్ పరిధి ఖరారు చేసారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి అధికారికంగా ఆపరేషన్స్ ప్రారంభించనున్నారు. విశాఖలోని వీఎంఆర్‌డీఏ డెక్ భవనాన్ని జోన్ తాత్కాలిక కార్యాలయానికి కేటాయించారు. జోనల్ మేనేజర్.. ఉద్యోగుల నియామక ప్రక్రియ పూర్తి చేసారు. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ కొత్త జోన్‌లోకి వస్తాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్ ఉండగా, దీని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్ పరిధిలోకి వస్తుంది. 385 స్టేషన్లు ఈ జోన్‌లో పరిధిలోకి రానున్నాయి. 4డివిజన్లలో కలిపి 62వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు.

విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు
విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్ల పరిధిలో జరిగే భద్రతాపరమైన పనులు, రైళ్ల రాకపోకలు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, రైల్వే కార్యకలాపాలన్నీ ఇక విశాఖ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఈ డివిజన్ల డీఆర్ఎం లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసిన దక్షిణ మధ్య రైల్వే జోన్ కు నివేదికలు ఇస్తుండగా.. ఇక నుంచి విశాఖ జోన్ కు నివేదించాల్సి ఉంటుంది. కాగా.. విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభం పైన రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖ టు తిరుపతి వందేభారత్ స్లీపర్ పైన త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని సర్వీసుల ప్రారంభం పైనా ప్రతిపాదన లు పరిశీలన స్థాయిలో ఉన్నాయి. దీంతో.. విశాఖ జోన్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణీకు లకు ప్రయోజనకరంగా మారనుంది.













Click it and Unblock the Notifications