ఇండియన్ రైల్వేకు ఇది న్యాయమేనా?
సాధారణ, మధ్య తరగతి ప్రయాణికులపై భారతీయ రైల్వే చిన్నచూపు చూస్తోంది. పాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లుగా మార్చి వారి నుంచి ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఐసీఎఫ్ బోగీల స్థానంలో ఎల్‌హెచ్‌బీ బోగీలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ స్లీపర్ బోగీల సంఖ్యను రోజురోజుకు తగ్గిస్తోంది. అన్ని రైళ్లల్లో 10కిపైగా స్లీపర్ బోగీలు ఉండేవి. వాటిని వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యకు రైల్వే తెచ్చింది.
70శాతం రైళ్లల్లో స్లీపర్ బోగీలు కేవలం 3 నుంచి 5 వరకే ఉంటున్నాయి. దీంతో అవి సరిపోక జనరల్ బోగీల్లా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. 22 బోగీలున్న ఒక రైలును పరిశీలించగా అందులో ఏసీ బోగీలు 14 ఉన్నాయి. మిగిలిన 8 బోగీల్లో 3 స్లీపర్, ఒకటి పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఒకటి ప్యాంట్రీ కార్ కాగా, ఒకటి జనరేటర్ కమ్ గార్డు బోగీ, మరొకటి జనరల్, ఇంకోటి దివ్యాంగులతోపాటు పార్సిల్స్‌కు కేటాయించారు.

దాదాపు 1200 నుంచి 1700 కిలో మీటర్లు దూరం ప్రయాణించే రైలులో స్లీపర్ బోగీల సంఖ్య కేవలం నాలుగు. ఎక్కువ దూరం ప్రయాణించే దాదాపు ప్రతి రైలుకు స్లీపర్ బోగీలను 3కు తగ్గిస్తున్నారు. వాటి స్థానంలో రెండు థర్డ్ ఏసీ ఎకానమి బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్లీపర్ బోగీల్లో సీట్లు లభించనివారు వాటిల్లోకి ఎక్కుతుండటంతో కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా ప్రయాణిస్తున్నాయి.
ఒకవేళ ఖాళీ లభించినా అంత దూర ప్రయాణాన్ని ఒంటికాలిపై నిలబడి లేదంటే ప్రయాణికుల మధ్య కిక్కిరిసి పయనించాల్సి వస్తోంది. గతంలో ఉన్నట్లుగానే స్లీపర్ బోగీలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే సిటిజన్స్ ఫోరమ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications