Railway news: ఈ కొత్త రైల్వే లైన్ తో సికింద్రాబాద్ నుండి గుంటూరుకు మూడు గంటల్లోనే!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే విస్తరణకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి, రైల్వేను అభివృద్ధి చేయడానికి శతవిధాల కృషి చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరింత విస్తృతమైన సేవలను అందించడానికి రైల్వే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణ వేగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నల్లపాడు-బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్
నల్లపాడు-బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చనుంది.మొత్తం 248 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును రూ. 2,853 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇది ఆరు దశల్లో పూర్తవుతుంది. ఇప్పటికే విష్ణుపురం-కుక్కడం, కుక్కడం-వొలిగొండ మధ్య పనులు ప్రారంభమయ్యాయి.

డిసెంబర్ నాటికి 30 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చెయ్యాలనే లక్ష్యం
డిసెంబర్ నాటికి కనీసం 30 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త రైల్వే లైన్ లో పది పెద్ద బ్రిడ్జి లను, 259 చిన్న బ్రిడ్జి లను నిర్మిస్తారు. రెండవ దశలో నల్లపాడు నుండి బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులు చేయవలసి ఉంది. దీనికి సంబంధించి టెండర్లను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో దశ పనులకు ఏపీ, తెలంగాణాలలో భూసేకరణ
ఈ ప్రాజెక్టుకు మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 135 హెక్టార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 65 హెక్టార్లు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ మాత్రమే ఉండడం వల్ల రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒక రైలును స్టేషన్లోనే నిలిపివేయాల్సి వస్తుంది. ట్రాక్ సామర్ధ్యాన్ని మించి రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది.
గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లోనే
ఈ మార్గంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసమే కేంద్రం రెండో లైను నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ రైల్వే లైన్ వల్ల ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. అదనంగా కొత్త రైళ్లను కూడా ఈ మార్గంలో నడపడానికి అవకాశం ఉంటుంది.
ప్రయాణికుల సంఖ్య పెరిగే ఛాన్స్
దీనివల్ల ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే కి సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది.












Click it and Unblock the Notifications