పండుగ రద్దీ వేళ రైల్వే బిగ్ న్యూస్, మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటన - రూట్.. షెడ్యూల్..!!
సంక్రాంతి పండుగ వేళ రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెగ్యులర్ గా నడిచే రైళ్లతో పాటుగా ప్రకటించిన స్పెషల్ ట్రైన్స్ ఖాళీలు లేవు. అటు ఆర్టీసీ బస్సుల్లోనూ రిజర్వేషన్లు నిండుకున్నాయి. ప్రయివేటు బస్సులు భారీగా వసూళ్లు చేస్తున్నారు. ప్రయివేటు వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ రోడ్ ఫుల్ రష్ గా మారింది. జాతీయ రహదారి కిటకిట లాడుతోంది. ఈ సమయంలో రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన రూట్ లో మరో పది ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఈనెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అదే విధంగా ఈనెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయి.

సంక్రాంతి పండుగ వేళ ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా ప్రత్యేక రైళ్లకు ఇవి అదనం. కాగా, ఈ రోజు ప్రకటించిన రైళ్లు విజయవాడ వరకు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్ వరకూ నడుస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా ట్రైన్స్‌ను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడింది. ఒక్క చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచే కాకుండా కొన్ని రైళ్లు బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచీ కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications