ఆగ్రహించిన వరణుడు: 26 మంది మృతి, గుండెచెరువు
హైదరాబాద్: రాష్ట్రంలో వరణుడి ఆగ్రహం చల్లారలేదు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. గుండె చెరువు అవుతోంది. సాధారణ జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్డు రవాణా నిలిచిపోయింది. పలు రైళ్లకు బ్రేకులు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార వంటి నదుల పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పరిస్థితి బీభత్సంగా మారింది.
శుక్రవారంనాడు మరో 12 మంది మరణించారు. దీంతో వర్షాలకు మరణించినవారి సంఖ్య 26కు చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20మంది మరణించినట్లు చెబుతోంది. వరదలకు 300 పశువులు కొట్టుకుపోయాయి. 4.34 లక్షల హెక్టార్లలో పంట నీట మునిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు 4,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 67,419 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు
భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా అతలాకుతలం అయింది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో రైల్వేట్రాక్‌పై వరద నీరు వచ్చిచేరింది. దీంతో బొమ్మాయిపల్లె వద్ద రేపల్లె ప్యాంసింజర్ రైలును నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
కట్టంగూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై రాకపోకలు బంద్ అయ్యాయి. కోదాడ, ఖమ్మం మీదుగా అధికారులు వాహనాలను మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. వర్షానికి పానగల్ బైపాస్‌లో ఓ కారు వరదలో కొట్టుకుపోగా అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
త్రిపురారం మండలంలో పెద్దదేవులపల్లి చెరువు కట్ట తెగడంతో పెద్దదేవులపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది. డిండి ప్రాజెక్టు పొంగిపొర్లుతుండటంతో శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోÄయి. వర్షానికి కొండభీమనపల్లి, పేర్వాల ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.
తెగిన సరూర్‌నగర్ చెరువుకట్ట
భారీ వర్షాలకు సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో చెరువు కట్ట తెగింది. దీంతో శివసాయికాలనీ, హనుమాన్‌నగర్ కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
పాపాగ్నిలో విద్యార్థి మృతదేహం
కడప జిల్లా వేంపల్లి మండలంలోని పాపాగ్ని నదిలో గల్లంతైన విద్యార్థుల్లో నవీన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఇద్దరు విద్యార్థులు పాపాగ్ని నదికి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. గత ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలించారు. మరో విద్యార్థి కోసం వారు గాలిస్తున్నారు.
కడప జిల్లా సుండుపల్లి - పీలేరు మార్గంలోని తిమ్మసముద్రం సమీపంలో బహుదానదిపై ఉన్న తాత్కాలిక వంతెన దెబ్బ తిన్నది. దీంతో శనివారం ఉదయం నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. 60 శివారు గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం లేకుండా పోయింది.
ఇందకీలాద్రికి వాహనాలు బంద్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడికి నాలుగో రోజు శనివారం కూడా వాహనాల రాకపోకలను నిలిపేశారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగే పడే ప్రమాదం ఉండడంతో రాకపోకలను నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. మెట్ల మార్గంలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
వాగులో చిక్కుకున్న గొర్రెలకాపర్లు
నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలో పలు కాలనీలు జలమయ్యాయి. 128 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక్కుర్తి వాగులో ఐదుగురు గొర్రెల కాపర్లు చిక్కుకుపోయారు. రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇదే జిల్లా భువనగిరిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం తెల్లవారు జామున సబ్ జైలు గోడ కూలింది. గోడ కూలడంతో ఉదయం 9 గంటల వరకు ఖైదీలను బ్యారక్ నుంచి బయటకు రానీయలేదు. భద్రత దృష్యా జైలులోని 33 మంది ఖైదీలను ఎస్కార్ట్ సాయంతో నల్లగొండ జైలుకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
వృద్ధురాలు మృతి
వర్షాలకు వరంగల్ జిల్లా కరీమాబాద్ పట్టణంలోని ఉర్సు ప్రాంతంలో ఇల్లు కూలి దెడ్డి రాధమ్మ (55) అనే మహిళ మరణించింది. శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. రాధమ్మ అక్కడికక్కడే మరణించగా ఆమె మనువడు శ్రీతేజ్ గాయపడ్డాడు.
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
కరీంనగర్ జిల్లా రామగుండం పరిధిలోని 1,2,3,4 ఉపరితల గనుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణివ్యాప్తంగా దాదాపు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications