ఏపీకి వానగండం... వార్నింగ్ ఇచ్చిన బంగాళాఖాతం
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలకు తోడు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో వర్షాలు
కాగా మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఆదివారం నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఏపీలో తాజా పరిస్థితులతో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30నుండి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
రానున్న మూడు రోజులూ వర్షాలకు ఛాన్స్
అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వర్షాలు పడే చోట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు రానున్న మూడు రోజులు ఉత్తర ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ ప్రాంతాలలో వర్ష సూచన
రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు పడే ప్రాంతాలలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications