ఫైవ్‌స్టార్ హోటల్‌లా మారిన రాజమండ్రి సెంట్రల్ జైలు??
రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రస్తుతం ఫైవ్‌స్టార్ హోటల్ లా మారిందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అదే జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు. తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో అతనికి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అనంతబాబుకు 5 స్టార్ హోటల్‌లో ఎటువంటి ఆతిథ్యాలు లభిస్తాయో అంతకుమించి లభిస్తున్నట్లు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

అందరూ కష్టపడి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు
అనంతబాబుకు సకల సౌకర్యాలు కల్పించడం కోసం, అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సర్వశక్తులూ ఒడ్డి కష్టపడుతున్నారు. వాస్తవానికి ఒక్కో గదిలో ముగ్గురు ఖైదీలను ఉంచాలి. కానీ అతని కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. వచ్చిన రెండోరోజే చక్కటి పరుపును ఏర్పాటు చేశారు. అతను ఎవరితో మాట్లాడాలనుకుంటే వారితో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఫోన్ సౌలభ్యం ఎలాగూ ఉండనే ఉంది. కోరిన భోజనం గది దగ్గరకు వచ్చి వాలుతోంది. ఇన్ని సౌకర్యాలున్నప్పుడు వాటిని ఫైవ్ స్టార్ హోటల్ అనకుండా సెంట్రల్ జైలు అంటారా? అంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తరుచుగా కలుస్తున్న ప్రజాప్రతినిధులు
ఆయన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు తరుచుగా అనంతబాబును కలిసి చర్చిస్తున్నారు. సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక ఇంకా బయటకు రాలేదు. అనంతబాబు పోలీసులకు చెప్పిన వివరాలకు, సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. అలాగే శ్రీరామ్ బగీచ అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఎవరు మాయం చేశారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపారం వివరాలు తెలుసుకోవడానికే
తెలుగుదేశం, జనసేన నాయకులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రజాప్రతినిధులు అనంతబాబును కలవడానికి కారణం అసాంఘిక పనుల వివరాలన్నీ తెలుసుకోవడం కోసమేనని, మైనింగ్, గంజాయి తదితరాలను ఏ తేదీన ఎవరికి పంపించాలి? స్టాక్ ఎక్కడుంది? ఏ పార్టీ దగ్గర ఎంత డబ్బు రావాలి? మనకు రావాల్సింది ఎంత? ఇలాంటి వివరాల కోసమే కలుస్తున్నారని, అనంతబాబు జైలులో ఉన్నా దర్జాగా వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, మరొక ముఖ్యనాయకుడికి అతను బినామీ అని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

జైల్లో కూడా దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్న అనంతబాబు
ఇప్పటికే జైల్లో ఒక ఖైదీపై అనంతబాబు దాడిచేశారనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు. తోటి ఖైదీతో మాటా మాటా పెరిగి అనంతబాబు దాడిచేయడంతో అతనికి గాయాలయ్యాయని సమాచారం. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేసేంత గాయాలవలేదని తెలుస్తోంది. అతను జైలులో ఉన్నప్పటికీ దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నాడని, ఇటువంటివారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని తెలుగుదేశం, జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications