రాజమండ్రి ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థి ఖరారు?
గత ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకున్న జనసేన ఈసారి ఎలాగైనా పదుల సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడంతోపాటు గౌరవప్రదమైన స్థాయిలో లోక్‌సభ సీట్లను కూడా గెలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చి మగోదావరి జిల్లాల్లో పార్టీ బలంగా ఉండటంతో సాధ్యమైనంతవరకు ఈ రెండు జిల్లాల నుంచే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలనే యోచనలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు.

జనసేనకు ఇవ్వాలనే యోచనలో టీడీపీ?
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై రెండుపార్టీలు స్పందించనప్పటికీ దాదాపు ఖరారైందంటూ వార్తలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిధిలో టీడీపీ బలంగా ఉంది. అయితే మురళీమోహన్, ఆయన కోడలు రూప పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో పార్టీ ఎంపీ స్థానాన్ని జనసేనకు వదిలివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం కావడానికి ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి.

బస్సు యాత్ర వాయిదా వేయడానికి కారణం?
విజయదశమి నుంచే బస్సు యాత్ర చేయాలనుకున్నప్పటికీ పార్టీని తన సొంత నిధులతో నడుపుతున్న పవన్ కల్యాణ్ దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి ఈ సమయంలో రెండు సినిమాలు పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా వాయిదా పడిన సమయంలో జనసేన తరఫున లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులను ఇప్పటినుంచే ఎంపిక చేయడంవల్ల పార్టీ కార్యకలాపాలకు అయ్యే ఖర్చును వారే భరాయించగలుగుతారని ఇతర నేతలు చెప్పడంతో ఆయన కూడా మొగ్గుచూపారు.

టీటైమ్ మురళి ఖరారు?
ఈ సమయంలో ఆయన ముందుగా రాజమండ్రి లోక్‌సభకు ఎంపీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ టీటైమ్ మురళిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు ఖర్చు ఆయనే పెట్టుకుంటున్నారు.
త్వరలో ప్రారంభమయ్యే బస్సు యాత్రకు సంబంధించి పార్టీకి ఆర్థిక భరోసా ఇచ్చారు. పలు రాష్ట్రాల్లో టీటైమ్ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తూ తన ఆదాయాన్ని పెంచుకుంటున్న మురళీకి ఆర్థిక బలం ఉండటంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా గెలిపించగలిగే సత్తా ఉంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని జనసేన వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.












Click it and Unblock the Notifications