జగన్‌కు సీమాంధ్రలో షాక్: అసంతృప్తి, రాజన్నదళం పార్టీ
నెల్లూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్ట అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ అసంతృప్త నేతలు షాక్ ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలువురు అసంతృప్త నేతలు రాజన్న దళం పేరిట కొత్త పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన సీనియర్ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే మేకపాటి రాజమోహన్ రెడ్డితో విభేదాల కారణంగా పలువురు నేతలు పార్టీ నుండి సస్పెండయ్యారు.
వారు ఒక్కటిగా రాజన్న దళం పేరుతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. విభేదాల కారణంగా మెట్టూకురి చిరంజీవి రెడ్డి సహా నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. వీరు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తమలాంటి అసంతృప్త నేతలను ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని వారు భావిస్తున్నారు.

తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని, తమ కష్టాన్ని అధిష్టానం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాజన్న దళం పార్టీని లాంఛనంగా ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేస్తామని వారు చెప్పారు.
కాగా గతంలో పార్టీలో విభేదాలు వచ్చినప్పుడు నెల్లూరులో నేతలు సొంత కుంపటి పెట్టుకుంటామని హెచ్చరించారు. పార్టీ నుండి బహిష్కృతులైన నేతలు ప్రత్యేకంగా 'రాజన్నదళం' ఏర్పాటు చేశారు. దానిని ఇప్పుడు పార్టీగా మార్చేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications