పిఠాపురంలో భారీ ప్రాజెక్ట్.. భూమిని కొన్న రామ్‌చరణ్, ఉపాసన
జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 70వేలకు పైగా భారీ మెజారిటీ సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఐదు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం నుంచి విజయం సాధించిన తర్వాత అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కొనుగోలు చేశారు. అందులో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పలువురు స్థిరాస్తి వ్యాపారులు పిఠాపురం ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తుండటంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి.
24 గంటలు అందుబాటులో ఉండేలా
పిఠాపురంలో పవన్ కల్యాణ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు రామ్ చరణ్, ఉపాసన ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ప్రాంత ప్రజలతోపాటు చుట్టుపక్కల జిల్లాలవారికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో అపోలో ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దీనికోసం పిఠాపురంలో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి, పవన్ కల్యాణ్ సేవాసమితి జాతీయ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పిఠాపురం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త బ్రాంచ్ ప్రారంభం కాబోతోందన్నారు. రాబోయే రోజుల్లో స్వర్గలోకం ఎక్కడో ఉండదని, అది పిఠాపురంలోనే ఉంటుందనే విషయాన్ని అందరూ చూస్తారని స్వామినాయుడు వ్యాఖ్యానించారు.

మారిపోతున్న పిఠాపురం రూపురేఖలు
చిరంజీవి తాజాగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలోనే నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే మెగా కుటుంబ సభ్యులంతా కలిసి పిఠాపురంను పవన్ కల్యాణ్ కంచుకోటగా మార్చే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. మరికొందరు మెగా కుటుంబ సభ్యులు కూడా పిఠాపురంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications