ఒంగోలు పీఎస్ లో రాంగోపాల్ వర్మ..! బాబు, పవన్, లోకేష్ కేసులో..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీతో అంటకాగిన టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రాంగోపాల్ వర్మపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టుకు సిద్ధమయ్యారు. అయితే హైకోర్టు ఆయన్ను అరెస్టు చేయకుండా విచారణ చేసుకోవాలని సూచించడంతో పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఆయన ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ పై తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ నేపథ్యంలో కూటమి నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై బురద జల్లే క్రమంలో వారి ఫొటోల్ని మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై గతంలో టీడీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు పంపినా రాకపోవడంతో హైదరాబాద్ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి వర్మ ఊరట పొందారు.

అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు అరెస్టు చేయకుండా రాంగోపాల్ వర్మను విచారణ కోసం రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు పంపడంతో ఆయన ఇవాళ హాజరయ్యారు. విచారణలో చంద్రబాబు, లోకేష్, పవన్ ఫొటోల మార్ఫింగ్ వెనుక ఎవరున్నారు, ఇందులో రాంగోపాల్ వర్మతో పాటు ఇతరుల పాత్ర ఎంత అనే ప్రశ్నల్ని పోలీసులు సంధిస్తున్నారు. రాంగోపాల్ వర్మ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసులో విచారణపై పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓసారి విచారణకు వర్మను పిలిపించిన పోలీసులు.. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేయడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. వర్మ కేసును తిరిగి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆయన్ను మరోసారి విచారణకు పిలిపించారా లేక ప్రభుత్వంపై నిజంగానే ఒత్తిడి ఉందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసులో వర్మను అరెస్టు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications