హోదా సెంటిమెంట్ బలంగా ఉంది, ఏం చేయాలో చూస్తాం: రామ్ మాధవ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటి మెంట్ బలంగానే ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా డిమాండ్ బలంగా ఉందని ఆయన చెప్పారు. దీని విషయంలో కేంద్రం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
అసోంలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆయన శనివారంనాడు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీకి ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి తాము కూడా అధికారంలో ఉన్నామని, అందువల్ల ఎపి అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని, ఇంకా కావాలని అడిగితే కేంద్రం సానుభూతితో పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పనిచేస్తాయని ఆయన చెప్పారు. కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అనడం లేదని, ఇంకా కావాలని అడుగుతోందని ఆయన చెప్పారు.
పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలు అనుసరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని చెప్పారు. దక్షిణాదిన బలపడడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. దేశంలోని కోస్తా ప్రాంతాల్లో తమ పార్టీ విస్తరిస్తుందని చెప్పారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతామని రామ్ మాధవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications