త్వరలో జగన్ బయోపిక్ ? పార్ట్ 1 "వ్యూహం"-పార్ట్ 2 "శపథం"-రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్
ఎప్పుడూ తన సినిమాలతో సంచలనాలు రేపే రాంగోపాల్ వర్మ ఈసారి మరో బయోపిక్ కు సిద్దమవుతున్నారు. నిన్న సీఎం జగన్ తో భేటీ అయి వెళ్లిన వర్మ ఇవాళ తాను త్వరలో తీసే బయోపిక్ కు సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో వెల్లడించారు. అలాగే వాటి పేర్లను కూడా ప్రకటించారు. అందులో ఏముండబోతోందో కూడా చెప్పేశారు. కానీ ఇది ఎవరి బయోపిక్ అన్నది మాత్రం రహస్యంగా ఉంచారు. తద్వారా ఈ ఉత్కంఠను మరింత పెంచేందుకు వర్మ ప్రయత్నించారు.

వైఎస్ జగన్-వర్మ భేటీ
నిన్న ఉన్నట్లుండి తాడేపల్లి వచ్చి సీఎం జగన్ ను కలిసి వెళ్లిన టాలీవుడ్ సంచలన దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ దాదాపు అరగంటసేపు చర్చలు జరిపారు. అనంతరం ఓ హోటల్ కు వెళ్లి సాయంత్రం అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి హైదరాబాద్ పయనం అయ్యారు. ఎయిర్ పోర్టు వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పకుండానే వర్మ వెళ్లిపోయారు.దీంతో జగన్ తో వర్మ జరిపిన చర్చలపై తెలుగు రాష్ట్రాల్లో భిన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న వర్మ ట్విట్టర్ లో వివరాలు ప్రకటిస్తారని భావించినా ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం మాత్రం వర్మ తాను చెప్పాలనుకున్న వివరాలు వెల్లడించారు.

బయోపిక్ ప్రకటించిన రాంగోపాల్ వర్మ
తాను త్వరలో ఓ బయోపిక్ తీయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ఇవాళ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను త్వరలో వ్యూహం పేరుతో ఓ రాజకీయ చిత్రం తీయబోతున్నట్లు వర్మ వెల్లడించారు. ఇది బయోపిక్ కాదని, అంతకన్నా లోతైన రియల్ పిక్ అని అన్నారు. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో మాత్రం నూటికి నూరుశ పాళ్లు నిజాలే ఉంటాయని వర్మ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దీనిపై ఉత్కంఠ మరించ పెంచేలా ఉన్నాయి.

వ్యూహం బయోపిక్ కథ ఇదే
ఇదే క్రమంలో తన బయోపిక్ వ్యూహం చిత్ర కథకు సంబంధించిన వివరాలు కూడా వర్మ ఇవాళ ట్విట్టర్ లో వెల్లడించారు. వ్యూహం చిత్ర నిర్మాత గతంలో తనతో వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ అని వర్మ తెలిపారు.
అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ అని వర్మ లీక్ ఇచ్చారు. అలాగే ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందన్నారు. రాచకురుపు మీద వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే వ్యూహం చిత్రమని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.

వ్యూహం, శపథం పేరుతో రెండు పార్ట్ లు..
ఎన్నికల టార్గెట్ గా ఈ సినిమా తీయడం లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో, చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనుక చెప్పట్లేదని వర్మ తన ట్వీట్ లో తెలిపారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా తీస్తున్నట్లు వర్మ వెల్లడించారు. మొదటి భాగాన్ని వ్యూహం పేరుతోనూ, రెండోభాగం శపథం పేరుతోనూ తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండింటిలోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజలు మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపే పార్ట్ 2 శపథంలో తగులుతుందన్నారు.












Click it and Unblock the Notifications