సన్యాసం తీసుకో: కెసిఆర్‌పై విజయశాంతి, పొన్నాల ఫైర్
మెదక్/ హైదరాబాద్: ఇచ్చిన మాట మీద నిలబడని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజకీయ విరమణ చేసి ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని మెదక్ కాంగ్రెసు శాసనసభ అభ్యర్థి విజయశాంతి సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, కానీ మాట తప్పారని ఆమె అన్నారు.
మాట తప్పడం కెసిఆర్ నైజమని ఆమె అన్నారు. గురువారంనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. తాను మెదక్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రజల కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా తెరాస సీనియర్ నేతలు హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి అడ్డుకున్నారని ఆమె విమర్శించారు

తాను వీధి దీపాలు, నీటి మోటార్లు ఏర్పాటకు విడుదల చేసిన నిధులను ఆ నాయకులు దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. తాను తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నానని, నిన్న కాక మొన్న పుట్టిన తెరాస తెలంగాణ కోసం పోరాటం చేశానని అనడం విడ్డూరమని ఆమె అన్నారు.
కాగా, కెసిఆర్‌పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోనియా వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని అంటున్న కెసిఆర్‌కే పాపం తగులుతుందని ఆయన అన్నారు. కెసిఆర్‌పై వచ్చిన ఆరోపణలకు క్లీన్‌చిట్ లభించిందా, ఆరోపణలకు కెసిఆర్ ఏనాడైనా సమాధానం ఇచ్చారా అని ఆయన అడిగారు. తనకు కొన్ని విషయాల్లో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన చెప్పారు.
గతంలో తెలంగాణ వ్యతిరేక పార్టీ తెలుగుదేశంతో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు మద్దతు ఇవ్వని తృతీయ కూటమితో కెసిఆర్ ఎలా జత కడుతారని ఆయన అడిగారు. రాజ్యాంగంపై కెసిఆర్‌కు నమ్మకం లేదని, ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications