గత అనుభవాల దృష్ట్యా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు రద్దు
Ratha Saptami 2025: ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి. ఈ పండగ కోసం తిరుమల ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వరు సమీక్షలు సైతం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నారు.
2 నుంచి 3 లక్షలమంది..
రథ సప్తమి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

టీటీడీ పాలకమండలి భేటీ..
ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రథ సప్తమి నాడు సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని వివరించారు. ఈ క్రమంలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని అన్నారు.
అన్ని సేవలు రద్దు..
అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు. ఎన్నారై, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దయింది.
బ్రేక్ దర్శనాలకు సంబంధించి..
ప్రొటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నింటినీ రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా టీటీడీ సిబ్బంది స్వీకరించరు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
భద్రత కట్టుదిట్టం..
రథ సప్తమి నాడు 1,250 మంది పోలీసులు, 1,000 విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలను అందించనున్నారు టీటీడీ అధికారులు. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి వచ్చే భక్తుల కొరకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు ఎమర్జెన్సీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు.
భక్తులకు అన్న ప్రసాదాలు..
భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను మోహరింపజేస్తారు. తెల్లవారు జాము నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తారు.
8 లక్షల లడ్డూల తయారీ
భక్తులకు అవసరమైన 8 లక్షల లడ్డూలు తయారీ. భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించడానికి వీలుగా భారీ ఎల్ఈడీ స్ర్కీన్ల ఏర్పాటు. భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా తాజా సమాచారం అందేలా చర్యలు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందించడానికి వీలుగా దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగించనున్నారు.












Click it and Unblock the Notifications