కేసీఆర్‌పై రావెల భగ్గు, 'బీజేపీతో ఒప్పందంవల్లే హోదాపై జగన్ మౌనం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తమ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. మీడియా గొంతు నొక్కుతున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.
బీజేపీతో జగన్ లోపాయికారీ ఒప్పందం: ఆనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం ఆరోపించారు.

తన సొంత ప్రయోజనాల కోసం బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ కారణంగానే ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరు సరిగా లేదన్నారు.
బేటీ బచావో - బేటీ పడావోను విజయవంతం చేస్తాం: గంటా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం కర్నూలు జిల్లాలో అన్నారు. ఆయన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications