మరిన్ని కొత్త జిల్లాలు?: ఆ రెండు పట్టణాలు కేంద్రంగా
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.

మారిన స్వరూపం..
కొత్త జిల్లాల రాకతో రాష్ట్ర స్వరూపం సమూలంగా మారిపోయింది. హద్దులన్నీ అటు ఇటు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ..కొన్ని చోట్ల పట్టువిడుపులను ప్రదర్శించింది. భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ సమదూరంలో జిల్లా కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లు..
ఇందులో వచ్చిన మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని- ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మళ్లీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదన అధికార వర్గాల్లో వ్యక్తమౌతోంది. 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 15 కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రకటించింది. కొత్తగా ఆవిర్భవించబోతోన్న 13 జిల్లాల్లో కొన్నింటికి.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్.

రాయలసీమలో జిల్లాల సంఖ్యను పెంచాలంటూ డిమాండ్..
ఈ పరిణామాల మధ్య రాయలసీమలో కొత్త జిల్లాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అదనంగా మరో రెండింటిని ఏర్పాటు చేయాలని రాయలసీమ మేధావుల వేదిక డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ వాటా అధికం. రాయలసీమ విస్తీర్ణం 42 శాతంగా ఉంటోంది. విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులను ఆధారంగా చేసుకుంటే- అదనంగా మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని మేధావుల వేదిక ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు నుంచి ఎనిమిది..
ప్రస్తుతం రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఉగాది నుంచి కొత్తగా మరో నాలుగు జత కానున్నాయి. కడప, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా, అనంతపురం, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల కేంద్రంగా అదే పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. దీనితో రాయలసీమ జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది.

అదనంగా మరో రెండు..
ఈ ఎనిమిదింటికి అదనంగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలనేది రాయలసీమ మేధావుల వేదిక డిమాండ్. చిత్తూరు జిల్లాలో మారుమూలన ఉన్న మదనపల్లిని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మదనపల్లి అన్నమయ్య జిల్లాలో విలీనం కానుంది. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే- ఆ ప్రాంతం అంతా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆ వేదిక ప్రతినిధులు చెబుతున్నారు.
Recommended Video

ఆదోని లేదా గుంతకల్లు..
అదే సమయంలో- కర్నూలు జిల్లాలోని ఆదోని లేదా, అనంతపురం జిల్లాలోని గుంతకల్లును కేంద్రంగా చేసుకుని మరో జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదోని కూడా కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ వంటి ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంటాయి. వెనుకబడిన ప్రాంతాలుగా ఉంటన్నాయి. అలాంటి ఆదోనిని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే- ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందనే డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications