21న రాయలసీమ ప్రత్యేక భేటీ: అభివృద్ధా, ప్రత్యేక రాష్ట్రమా?
హైదరాబాద్: రాయలసీమలో అసంతృప్తి పేరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాయలసీమ హక్కుల పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన ఉద్యమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో సంఘటితమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా విడివిడిగా ఉద్యమాలు నిర్వహిస్తున్న సంస్థలు, ఉద్యమ వేదికలన్నింటికీ ఈ నెల 21న తిరుపతిలో నిర్వహించబోయే విస్తృత భేటీకి ఆహ్వానాలు పంపుతున్నారు.
తమ వైఖరులను వెల్లడించాలని కోరుతూ రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రధాన పార్టీల నేతలనూ ఈ భేటీకి ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి, ఆ రోజు ఎజెండా ఖరారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రాయలసీమ అభివృద్ధి సమితి పేరిట పోరాడుతున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి, మాజీ ఐజీ హన్మంతరెడ్డి ఈ భేటీ ఏర్పాట్లలో ఉన్నారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన రాయలసీమ నాయకులు పలువురు తమ పార్టీలకు రాజీనామాలు చేసి, సీమ హక్కుల సాధన ఉద్యమంలో చేరనున్నారనే వార్తల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు కోస్తాంధ్రకు దీటుగా అభివృద్ధిని డిమాండ్ చేస్తూ ఉద్యమం నడిపించాలా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలా? అన్నదానిపై ప్రధానంగా చర్చ సాగతుందని అంటున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా, లెఫ్ట్ ముఖ్యులంతా సీమ నుంచి వచ్చినవారే అయినా మాకెందుకీ దురవస్థ? పొలిటికల్ కోవర్టులకు అవకాశం ఇవ్వకుండా ఉద్యమాన్ని ఎలా నిర్మించాలనేదే మా ప్రస్తుత ఆలోచన అని రాయలసీమ సోషల్ మీడియా ఫోరం ప్రతినిధి తిరుమల ప్రసాద్ పాటిల్ వివరించారు.












Click it and Unblock the Notifications