దారుణం: నిశ్చితార్థం ముందురోజే వ్యక్తి హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన మహ్మద్ అవాయిస్(26) అన్వర్ ఉలూం డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ స్థానిక జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. అవాయిస్ రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహరాలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా సోమవారం అర్ధరాత్రి మాట్లాడాలని ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు అవాయిస్‌ను లంగర్‌హౌజ్‌లోని నానల్‌నగర్‌లోని షా గౌస్ హోటల్ వద్దకు రప్పించారు. అవాయిస్, తన సోదరుడు అసిఫ్, మరో ఇద్దరితో కలిసి రాత్రి 2గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లాడు.
అయితే అప్పటికే అవాయిస్ కోసం వేచిచూస్తున్న దుండగులు అక్కడికి రాగానే అతనితో వాగ్వాదానికి దిగారు. అంతలోనే అవాయిస్‌ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైన అవాయిస్ అన్న అసిఫ్, ఇతరులు దుండగులను అడ్డుకుని అవాయిస్‌ను దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అవాయిస్ ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికి మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అవాయిస్ మృతదేహాన్ని బజార్‌ఘాట్‌లోని తన ఇంటికి తరలించారు.
కాగా మంగళవారం అవాయిస్ నిశ్చితార్థం ఉండడంతో ఆ ఏర్పాట్లలో ఉన్న బంధువులు అవాయిస్ మరణవార్తతో విషాదంలో మునిగిపోయారు. తన ఇంటికి అవాయిస్ మృతదేహాన్ని తీసుకురావడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. అవాయిస్ కొనసాగుతున్న పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీ షీటర్ ఫిర్దోజ్‌తోపాటు షరూక్, అల్తాఫ్‌లు అవాయిస్ హత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న లంగర్ హౌజ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications