Raghu Rama:షర్మిల యూ టర్న్: ఆంధ్రా ప్రజలు అక్కడ హ్యాపీ : మీ గెలుపులోనూ నాడు - రాజకీయం కోసం నేడు..!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతన్న నీటి వివాదం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. అందులో షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తూ ఏం చెప్పారనే విషయాన్ని, భర్త, అత్తగారి ఇల్లు పేరుతో తెలంగాణకు వెళ్లి అక్కడ ఇప్పుడు ఏం చెబుతున్నారనే విషయాన్ని చూస్తే ఆమె యూ టర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతున్నా మనం ఆ విషయం జోలికి వెళ్లవద్దంటూ కామెంట్ చేసారు. నదీ జలాల విషయంలో మీరు తరచూ చెబుతున్న మాటలపై మాత్రం ఇరు రాష్ట్రాల ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.

ఇద్దరు సీఎంల మధ్య మంచి అవగాహన..
మే 14వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కీలక పరిణామాలు, పక్క రాష్ట్ర నాయకత్వంతో మీకు ఉన్న మంచి సంబంధాలను వెల్లడిస్తుందని.. మీ ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉన్నట్లు కూడా ఆ నాటి సంఘటనలు తరచి చూస్తే అర్ధం అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు మీకూ, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య ఉన్న సంబంధాలపై నిశిత విమర్శలు చేశాయని... అయితే వాటిని మీరు తీవ్రంగా ఖండించారని గుర్తు చేసారు. పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారని వివరించారు.

2019లో మీ విజయానికి కేసీఆర్ సహకారం..
తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండడం వాంఛనీయమే అని చెబుతూనే... ఇదే 2019 సాధారణ ఎన్నికలలో మీరు అప్రతిహత విజయం సాధించడానికి కూడా ఉపకరించిందనేది నిర్వివాదాంశంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజల బాగోగుల గురించి మీరు ఆలోచించడం చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారికి నచ్చడం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధానికి లేఖలు రాయడం అనేది సత్వర ఫలితాలను ఇవ్వదనే విషయం మీకు తెలిసి ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీశైలం రిజర్వాయర్ ఆపరేషనల్ కంట్రోల్ మన వద్దే ఉండగా మీరు తెలంగాణ తో పోరాటం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు.

సెటిలర్లు అక్కడ హ్యాపీ..నచ్చటం లేదు..
మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ దిగువప్రాంతాలలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదన్నారు. తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్లు కేసీఆర్ ప్రభుత్వంతో, అక్కడి పాలనా విధానాలతో ఎంతో సంతోషంగానే ఉన్నారని.. ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకువస్తున్నానని చెప్పారు. మీ భయాలకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడి ఆంధ్రా ప్రజలను చక్కగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా సెటిలర్లపై ఎలాంటి వివక్ష చూపించడం లేదని స్పష్టం చేసారు. మీరు పంచుకుంటున్న హార్దిక సంబంధాన్ని కొనసాగించేందుకు మీరు పోరాటం చేయడం కన్నా వారితో కూర్చుని మాట్లాడితే సరిపోతుందని నేను భావిస్తున్నానని సూచించారు.

రాజకీయ లబ్ది కోసం వద్దు..
మనమేదో రాజకీయ లబ్ది కోసం మాత్రమే ఇలా తగవును నెత్తికెత్తుకుంటున్నామని కొందరు అనుకుంటుండగా మీరు దీన్ని సామరస్యంగా ఇప్పటికైనా పరిష్కరించుకోకపోతే దీన్ని ప్రజలు అందరూ సినిమా స్టంట్ అనుకోవడానికి కూడా వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఒక విచిత్రమైన విషయాన్ని ఇక్కడ అందరూ తెలుసుకోవాలి. అదేమంటే రెండు రాష్ట్రాలలో నీటిపారుదల పనులను చేపట్టి ప్రాజెక్టులు నిర్మించే పెద్ద కంపెనీ ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న నీటి తగాదాను ఇరు రాష్ట్రాల మధ్య చర్చలతో పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి. లేకపోతే కేంద్రం, వాటర్ ట్రిబ్యునల్స్ చెప్పేది వినండి. అంతే కానీ రాజకీయ అవసరాల కోసం దీన్ని పెంచి పెద్దది చేయవద్దంటూ లేఖలో రఘురామ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications