శ్రీవారి లడ్డూల విషయంలో ఫలిస్తోన్న టీటీడీ వ్యూహాలు..
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. బుధవారం నాడు 70,256 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,102 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.79 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
2025లో టీటీడీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 2024తో పోల్చుకుంటే ఏకంగా 10 శాతం మేర అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ. 2024లో 12.15 కోట్ల లడ్డూలు విక్రయించగా ఆ మరుసటి ఏడాది మొత్తం మీద 13.52 కోట్ల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు. అంటే 2024తో పోల్చుకుంటే 1.37 కోట్ల లడ్డూలు అదనంగా విక్రయించింది. గత దశాబ్ద కాలంతో పోల్చుకున్నా ఇది రికార్డే.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2025 డిసెంబర్ 27వ తేదిన అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధిక విక్రయం. టీటీడీ గత సంవత్సరం నుంచీ ప్రతిరోజూ నాలుగు లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది. పండగలు, విశేష ఉత్సవాలు, వారాంతపు రోజుల్లో 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ ను భక్తలకు అందుబాటులో ఉంచుతోంది.
700 మంది శ్రీవైష్ణవ బ్రహ్మణులు శ్రీవారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంటలు శ్రమిస్తూ నియమ, నిష్టలతో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూలను విక్రయించడానికి తిరుమలలో కియోస్క్ లను అందుబాటులోకి తీసుకుని రావడం వల్లే ఇది సాధ్యమైనట్లు చెబుతున్నారు. కియోస్క్ ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేయడానికి భక్తులు మొగ్గు చూపుతున్నారు.












Click it and Unblock the Notifications