హీరోయిన్లనూ చెడగొడుతున్నారు: నీతూ అగర్వాల్ ఉదంతంపై బాబు వ్యాఖ్య
ఏలూరు: ఎర్రచందనం దొంగలు సినిమాల్లో పెట్టుబడులు పెట్టి హీరోయిన్లనూ చెడగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నటి నీతూ అగర్వాల్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఎర్రచందనం స్మగ్లరను వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో 10-15 ఓడరేవులు రానున్నాయని, స్మగ్లర్లు దోచుకున్న ఎర్రచందనంలో ఒకశాతం పట్టుకుంటే రూ.2,500 కోట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా బహిరంగ సభలో శుక్రవారంనాడు ఆయన ప్రసంగించారు.

"ఆడపడుచులూ ... మీ అత్తగారింట్టో మరుగు దొడ్డి లేకుంటే వెంటనే పుట్టింటికి వెళ్లి పోండి. మరుగుదొడ్డి కట్టే వరకూ ఇంటికి రానని మీ భర్తలకు చెప్పండ"ని చంద్రబాబు మహిళలకు పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్ల కన్నా మరుగుదొడ్లే ముఖ్యమని ఆయన అన్నారు. ఉపాధి హామీ, పంచాయతీ, సీఎస్సార్ నిధులు కలిపి అన్ని పంచాయతీల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు వేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లో సిసి రోడ్డలను రూ.200 కోట్లతో వేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాల ప్రజల వల్లనే తాను ముఖ్యమంత్రినయ్యానని చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ జిల్లాల ప్రజలకు తాను రుణపడి ఉంటానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆయన అన్నారు. త్వరలో కాకినాడలో పెట్రో విశ్వవిద్యాలయం వస్తుందని చంద్రబాబు చెప్పారు.
నీరు-చెట్టు కార్యక్రమంలో శుక్రవారంనాడు చంద్రబాబు పాల్గొన్నారు. వేట్లపాలెంపై ఈ సందర్భంగా ఆయన వరాల జల్లు కురిపించారు. గ్రామంలోని కళ్యాణ మండపం అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి రూ. 5 కోట్లు నిధులు ప్రకటించారు. కొత్తగా 1100 మరుగుదొడ్లు, రూ. 18 లక్షలతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రాకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తనకున్న అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిలోగా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కాటన్ దొర 150 ఏళ్ల క్రితమే బ్యారేజీలు నిర్మించారని, దూరదృష్టితోనే ప్రాజెక్టుల నిర్మాణం, నీరు-చెట్టు కార్యక్రమం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే సంవత్సరం పుష్కర లిఫ్ట్ కింద 1.75 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications